బాబు వ‌ద్ద‌కు కొత్త పంచాయ‌తీ

Update: 2016-08-09 13:06 GMT
తెలుగుదేశం పార్టీలో ప‌ద‌వుల సిగ‌ప‌ట్లకు ఇపుడు ఢిల్లీ వేదిక‌గా మారింది. తెలుగుదేశం పార్టీలో ఇద్దరు సీనియర్ల మధ్య ప‌రోక్ష యుద్ధంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు, కేంద్ర మంత్రి సుజనాచౌదరిల మధ్య తగవు తారాస్థాయికి చేరినట్లుగా తెలుస్తోంది. ఈ గొడవ చంద్రబాబు ముంగిటికి చేరినట్లు సమాచారం.  ఢిల్లీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి టీడీపీలోని ఇద్దరు నేతల మధ్య అగ్గి రాజేస్తోంది.. ఎవరికి వారు పట్టింపులకు పోవడం.. పార్టీ అధినేత చంద్రబాబుకు తలనొప్పులు తెస్తోంది.

ప్రస్తుతం ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కొనసాగుతున్న కంభంపాటి రామ్మోహన్‌రావు రెండేళ్ల పదవీకాలం ముగిసింది. తనను మరోసారి కొనసాగిస్తారని కంభంపాటి భావించారు. అయితే.. చంద్రబాబు.. ఆయనకు మరో గౌరవప్రదమైన బాధ్యతను ఇస్తానని చెప్పారని భోగట్టా. దీంతో కంభంపాటి ''సుజనాచౌదరి లాంటి వారికన్నా నేనేమీ తక్కువ కష్టపడలేదు. సుజనాకు రెండోసారి రాజ్యసభ.. మంత్రిపదవి ఇచ్చినప్పుడు తనకు ఎందుకు అవకాశం ఇవ్వరు?'' అని అధినేతను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కంభంపాటి వ్యాఖ్యలు తెలుసుకున్న సుజనాచౌదరి.. వివాదంలోకి తనను ఎందుకు లాగుతారంటూ కంభంపాటిని నిలదీసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఇద్దరూ నువ్వా నేనా అన్న స్థాయిలో పంతాలకు పోవడంతో వ్యవహారం.. చంద్రబాబు సమక్షానికి చేరిందని చెబుతున్నారు.

నిజానికి ఇద్దరి మధ్యా కోల్డ్‌వార్‌ ఎప్పటినుంచో నడుస్తోందని పార్టీ వర్గాల కథనం. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కంభంపాటి ఉన్నా.. సుజనాచౌదరి ఆయనతో ముందునుంచీ అంటీ ముట్టినట్లుగా వ్యవహరించారని సమాచారం. పైగా ఏపీకి రావాల్సిన నిధులు, రెవిన్యూలోటు, విభజన హామీల అంశాలపై కంభంపాటిని పక్కకు పెట్టి.. సుజనాచౌదరియే అరుణ్‌జైట్లీలాంటి కీల‌క మంత్రుల‌తో మాట్లాడేవారు. ఇలాంటి సమావేశాలకు సంబంధించి నామమాత్రపు సమాచారం కూడా ఇచ్చేవారు కాదని కంభంపాటి చాలాకాలంగా గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు తన పదవి పొడిగింపునకూ సుజనా అడ్డుపడుతున్నారన్న బలమైన భావనలో కంభంపాటి ఉన్నారు. కంభంపాటి, సుజనా చౌదరిల మధ్య తారాస్థాయికి చేరిన తగవు.. ఇప్పుడు చంద్రబాబు సమక్షానికి చేరినట్లు భోగట్టా. ఈ నేపథ్యంలోనే.. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి లోకేశ్‌ పేరు తెరపైకి వచ్చింది. దీన్ని లోకేశ్‌ సన్నిహితులూ ధ్రువీకరిస్తున్నారు. లోకేశ్‌కు జాతీయ నేతలతో పరిచయాలు పెంచడం, ఢిల్లీ వ్యవహారాలు, రాజకీయాలపై మరింత అవగాహన కల్పించడం ద్వారా ఆయన రాజకీయ భవిష్యత్తుకు మరింత బలమైన పునాది వేయాలన్నదే బాబు భావనగా ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీని బలోపేతం చేయడంతో పాటు.. రాష్ట్ర రాజకీయాల్లో మరింత పట్టు సాధించేందుకు.. లోకేశ్‌ను ఇక్కడే ఉంచుతారనే ప్రచారమూ పార్టీలో జరుగుతోంది.

నారా లోకేశ్‌.. రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కావాలని నిర్ణయించుకుంటే.. కంభంపాటి పదవి కొనసాగింపునకు లైన్ క్లియర్ అయినట్లే అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే చంద్రబాబు ఎటూ తేల్చకపోవ‌డంతో ఉత్కంఠ పెరిగిపోతోంది. మ‌రోవైపు ఇప్పటికే ఒకరిద్దరు ఎంపీలతో పాటు మరికొందరి పేర్లను ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్టుకు సుజనా సూచించారని టాక్... ఏదేమైనా... కోర్ టీంలోని ఇద్దరు సీనియర్‌ సభ్యుల మధ్య రేగిన ప్రత్యేక పోస్టు రగడ బాబుకు ఇబ్బందిగా మారిందని అంటున్నారు. మరి చంద్రబాబు ఈ వివాదాన్ని ఎలా ముగిస్తారో వేచి చూడాలి.
Tags:    

Similar News