వివాదం సద్దుమణగడం ఆయనకిష్టంలేదు!

Update: 2017-10-30 09:37 GMT
పుస్తక రచనతో తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ప్రొఫెసర్ ఐలయ్య వివాదం సద్దుమణగడం ఇష్టంలేనట్లు వ్యవహరిస్తున్నారని అనిపిస్తోంది. ఉరితీయాలి, చంపాలి.. అనే రేంజిలో ఈ వ్యవహారం మీద ఆందోళనలు రేగిన తర్వాత.. ఇన్నాళ్లుగా ఐలయ్య వాదనకు మద్దతు ఇచ్చిన పార్టీల వారు మేధావులు కూడా ఒక మెట్టు దిగివచ్చి.. వివాద పరిష్కారానికి మొగ్గు చూపితే.. ఐలయ్య మాత్రం తూచ్ అంటున్నారు. నా తరఫున ఒప్పందం చేసుకోవడానికి వాళ్లెవరు.. దానికి నాకు సంబంధం లేదు అన్నట్లుగానే ఆయన వైఖరి సాగుతోంది. వివాదం ఇంకా ముదురుతూనే ఉంది.

వివరాల్లోకి వెళితే..

ప్రొఫెసర్ స్థాయి వ్యక్తి మేధోపర ఆలోచనలు రేకెత్తించి యువత భవితకు మంచి బాటచూపి మార్గదర్శకం చేయకపోగా పిచ్చిరాతలతో కులమతాలను రెచ్చగొడుతున్నారని సర్వత్రా ఆందోళనలు, రాస్తారోకోలతో నిరసన తెలిపారు. పోటాపోటీగా నిర్వహింప తలపెట్టిన సభలు - సత్కార కార్యక్రమాలకు ప్రభుత్వంనుంచి అనుమతి లేకుండా పోయింది. ‘‘ సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’’ అనే ప్రొఫెసర్ ఐలయ్య పుస్తకరచన ను నిషేధించాలని వైశ్య సంఘప్రతినిధులు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు విన్నవించారు. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. విజయవాడలో ఈ నెల 28 తేదిన కంచె ఐలయ్యకు సంఘీభావ సభను నిర్వహించాలని సామాజిక జెఎసి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తామూ పోటీగా సభ నిర్వహించబోతున్నామని బ్రాహ్మణ - వైశ్య సంఘాలు ముందుకొచ్చాయి. శాంతి భద్రతలకు విఘాతం తలెత్తుందని డిజిపి సాంబశివరావు ఇరు సంఘాలకు అనుమతి నిరాకరించారు.

ఈ నేపథ్యంలో కంచె ఐలయ్య రచనపై వివాదం సద్దుమణిగేలా చూడాలని సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇతర బహుజన నాయకులు - ఆర్య - వైశ్య నాయకుల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ‘‘సామాజికి స్మగ్లర్లు కోమటోళ్లు ’’ శీర్షికలో మార్పు చేస్తామని - మనోభావాలను దెబ్బతీసే అంశాలను - అభ్యంతర కర విషయాలను తొలగిస్తామని, భవిష్యత్తు కుల ప్రస్తావనకు చేయబోమని అందులో నిర్ణయించారు. దీంతో వివాదం సద్దుమణిగిందనుకున్న నేపథ్యంలో రచయిత కంచె ఐలయ్య మరోసారి తెరపైకొచ్చి ఆ ఒప్పందంతో తమకు సంబంధంలేదని ప్రకటించారు. ఇదంతా చూస్తుంటే వివాదం తెరమరుగు చేసే ఉద్ధేశం ఐలయ్యలో కాసింతైనా కానరాలేదనిపిస్తోంది. మేధావులు పంతానికి పోకుండా వివాదం సద్దుమణిగే విధంగా వ్యవహరిస్తా బాగుంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News