`ఐల‌య్య పైత్యం` కౌంట‌ర్ అదిరిందే!

Update: 2017-11-18 10:47 GMT
వివాదాస్ప‌ద ర‌చ‌యిత కంచె ఐల‌య్య‌కు షాక్ ఇస్తూ.. ఓ పుస్త‌కం వ‌చ్చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌నే బ్రాహ్మ‌ణులు, కోమ‌ట్ల‌పై పుస్త‌కాలు రాశారు. అదేవిధంగా ఆవును ఆర్థిక జంతువా? ఆహార జంతువా? ఆధ్యాత్మిక జంతువా? అంటూ ప్ర‌త్యేక చ‌ర్చ పెట్టి ర‌చ్చ ర‌చ్చ చేశారు. ఇక‌, సామాజిక స్మ‌గ్ల‌ర్లు కోమ‌టోళ్లు పేరుతో రాసిన పుస్త‌కం తాలూకు మంట‌లు ఇప్ప‌టికీ చ‌ల్లార‌లేదు. ఇలా ఓ ప్రొఫెస‌ర్ అయి ఉండి కొన్ని వ‌ర్గాలు, కులాల‌పై ఐల‌య్య రాసిన పుస్త‌కాలు పెను సంచ‌ల‌నం, వివాదాల‌కు కేంద్ర బిందువులుగా మారాయి. అయితే, అనూహ్యంగా ఇప్పుడు ఆయ‌న‌పైనే ఓ పుస్త‌కం వ‌చ్చేసింది. ఏకంగా ఐల‌య్య‌ను టార్గెట్ చేస్తూ.. ``ఐల‌య్య పైత్యం`` పేరుతో వ‌చ్చిన ఈ పుస్త‌కం కూడా అంతే తీరుగా వివాదానికి కేంద్ర బిందువుగా మారిపోయింది.

ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు - సీనియ‌ర్ ఎడిట‌ర్ ఎంవీఆర్ శాస్త్రి.. ఈ ఐల‌య్య పైత్యం పుస్త‌కం రాశారు. ఈ పుస్త‌కంలో.. ఐల‌య్య‌ను ఓ క్రైస్త‌వుడిగా శాస్త్రిగారు పేర్కొన్నారు. ఐలయ్య రచించిన 'హిందూ మతానంతరం భారతదేశం', 'నేను హిందువు నెట్లయిత' పుస్తకాల్లోపేర్కొన్న చాలా విష‌యాల‌ను ఉటంకిస్తూ.. తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.  హిందూ మతంపై అవగాహన లేని రాతలు ఐలయ్యవి- అని దుయ్య‌బ‌ట్టారు. ఐలయ్య రాసిన 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకంతో తాను పూర్తిగా విభేదిస్తున్నానని చెప్పారు. హిందువులను కించపరిచేలా ఐలయ్య రచనలు చేస్తున్నారని... హిందువుల నాశనాన్ని ఆయన కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు.

విష్ణువుకు - బ్రహ్మకు మధ్య తేడా కూడా తెలియని వ్యక్తి ఐలయ్య అంటూ మండిపడ్డారు. ఐలయ్య మేధావి కాదని... ఆయన వెనుక దేశాన్ని క్రైస్తవీకరణ చేయాలన్న కుట్ర ఉందని ఆరోపించారు. హిందూ మతాన్ని నాశనం చేయాలనేది ఐలయ్య కోరిక అని పేర్కొన్నారు. హిందూ మతం నాశనాన్ని కోరుకునేవారు అన్యమతస్తులే అని శాస్త్రి నిప్పులు చెరిగారు. అయితే, ఐల‌య్య కూడా శాస్త్రిపై విమ‌ర్శ‌లు గుప్పించారు.  ఆయన జీవిత కాలంలో ఏనాడైనా కులవృత్తులు చేసుకునే వారి మధ్యకు వెళ్లి, ఎడిటోరియల్ రాశారా అని ప్రశ్నించారు. శాస్త్రిగారి బంధువులు క్రైస్తవ భాష అయిన ఇంగ్లీషులో ఎందుకు చదువుకుంటున్నారని అన్నారు.

దేవుడు అందరినీ సమానంగా సృష్టించారని మీరు నమ్ముతున్నారా అని ఐల‌య్య ప్ర‌శ్నించారు. ఇంగ్లీష్ చదువుకున్న అగ్రకులస్తులంతా తమ పేర్ల వెనుక పాస్టర్లు అని పెట్టుకోవాలని సూచించారు. తన తల్లిదండ్రులు గొర్రెల కాపర్లు కావడంతో తాను 'షెపర్డ్' అని పేరు పెట్టుకున్నానని చెప్పారు. ఉత్పత్తి కులాల కోసం రచనలు చేస్తున్నవారిని పిచ్చోళ్లు అంటున్నారని విమర్శించారు. తాము దేశ పునాదులను మార్చాలనుకుంటున్నామని... తిట్టుకు తిట్టు ఎప్పటికీ సమాధానం కాదని చెప్పారు. ఎంవీఆర్ శాస్త్రికి దేశ చరిత్ర తెలియకపోతే తన పుస్తకాలను చదవాలని సూచించారు. మొత్తానికి ఇది మ‌రో వివాదానికి దారి తీసే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.
Tags:    

Similar News