కామ్రేడ్ చీఫ్ కి షాకిచ్చిన కన్హయ్య

Update: 2016-03-10 03:46 GMT
దేశాన్ని ప్రభావితం చేసే అధినేత ఒకరు.. ఒక విద్యార్థి నాయకుడి సాయాన్ని అడిగితే..? అందుకు సదరు విద్యార్థి నాయకుడు ఎలా స్పందిస్తాడు? అంత పెద్ద అధినేత అడిగితే.. విద్యార్థి నాయకుడు ఓకే అనకుండా ఉంటారా? అని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. రాజకీయ వర్గాల్లో తాజా చర్చగా మారటమే కాదు.. ఇప్పుడా అధినేత ముఖం చూపించలేని దుస్థితి. ఇంతకీ ఎవరా అధినేత.. ఎవరా విద్యార్థి నాయకుడన్న విషయంలోకి వెళితే..

ఢిల్లీ జేఎన్ యూ వివాదంలో పీకల్లోతుల్లో కూరుకుపోయి.. దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న విద్యార్థి నేత కన్హయ్య సుపరిచితుడే. ఇతని ఇష్యూలో పిలవని పేరంటానికి వెళ్లినట్లుగా.. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఎంట్రీ ఇవ్వటమే కాదు.. కన్హయ్య తరఫున పెద్ద ఎత్తున పోరాటమే చేసిన విషయాన్ని మర్చిపోలేం. ఆ ధీమాతో కావొచ్చు.. త్వరలో జరిగే పశ్చిమ బెంగాల్.. కేరళలో జరిగే ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ తరఫు ప్రచారం చేసేందుకు కన్హయ్య సిద్ధమన్నట్లుగా ఆయన ప్రకటించారు. ఇంతవరకూ బాగానే నడిచినా ఇక్కడే కథ అడ్డం తిరిగింది.

సీపీఎం తరఫున ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం లేదంటూ కన్హయ్య స్పష్టం చేయటం కమ్యూనిస్ట్ లకు ఇప్పుడు షాకింగ్ గా మారింది. సీతారాం ఏచూరి నుంచి వచ్చిన ఆఫర్ పై స్పందించిన కన్హయ్య.. తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. తన పీహెచ్ డీ పూర్తి అయిన తర్వాత.. అధ్యాపక వృత్తిని స్వీకరించాలన్న ఉద్దేశాన్ని ప్రకటించాడు. ఒక విద్యార్థి నాయకుడితే బోలెడంత రాజకీయ మైలేజీ పొందటమే కాదు.. కమలనాథుల మీద అస్త్రంగా ప్రయోగించాలనుకున్న కమ్యూనిస్ట్ చీఫ్ కు తాజా పరిణామం పెద్ద షాక్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News