ఆట మొద‌లు?: క‌న్నా చేతికి ఏపీ బీజేపీ ప‌గ్గాలు

Update: 2018-05-13 08:44 GMT
కొద్దికాలంగా నాన‌పెడుతున్న కీల‌క నిర్ణ‌యాల‌కు సంబంధించి ఒక ముఖ్య‌మైన నిర్ణ‌యాన్నిబీజేపీ తీసుకుంది. ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా ఎంపిక విష‌యంలో సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకుంది బీజేపీ అధినాయ‌క‌త్వం. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన వెంట‌నే ఏపీ స‌ర్కారుకు చుక్క‌లేన‌ని చెబుతున్న బీజేపీ నేత‌ల మాట‌ల‌కు త‌గ్గ‌ట్లే తాజా నిర్ణ‌యం ఉంద‌న్న మాట వినిపిస్తోంది.

ఏపీ బీజేపీ అధ్యక్ష ప‌ద‌వికి హ‌రిబాబు రాజీనామా చేయ‌టం తెలిసిందే. ఈ స్థానంలో మ‌రొక‌రిని నియ‌మించ‌కుండా ఇంత కాలం ఆగిన బీజేపీ అధినాయ‌క‌త్వం తాజాగా మాజీ మంత్రి.. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు కీల‌క ప‌ద‌విని క‌ట్ట‌బెడుతూ నిర్ణ‌యం తీసుకుంది.

మంచి మాట‌కారి.. ప్ర‌జ‌ల్లో ఇమేజ్ ఉన్న క‌న్నా.. గ‌డిచిన కొంత‌కాలంగా కామ్ గా ఉంటున్నారు. ఇటీవ‌ల ఆయ‌న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌చ్చే వీలుంద‌న్న ప్ర‌చారం జోరుగా సాగింది. దివంగ‌త మ‌హానేత వైఎస్ హ‌యాంలో ఒక వెలుగు వెలిగిన క‌న్నాను ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా అమిత్ షా ఎంపిక చేశారు. ఏపీ ప‌గ్గాలు ప‌ట్టుకునేందుకు విప‌రీతంగా ఆశ‌ప‌డ్డ ఎమ్మెల్సీ సోము వీర్రాజునుఏపీ బీజేపీ ఎన్నిక‌ల నిర్వాహ‌ణ క‌మిటీ క‌న్వీన‌ర్ గా డిసైడ్ చేశారు.

నాలుగేళ్లుగా ఏపీ బీజేపీకి అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించిన హ‌రిబాబు ఈ మ‌ధ్య‌నే త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబుపై దూకుడుగా విమ‌ర్శ‌లు చేసే సోముకు పార్టీ అధ్యక్ష బాధ్య‌త‌లు అప్ప‌గించే వీలుంద‌న్న మాట బ‌లంగా వినిపించింది. ఒక‌ద‌శ‌లో సోమ‌కు సంకేతాలు అందిన‌ట్లుగా చెబుతారు.కానీ.. చివ‌రిక్ష‌ణాల్లో చోటు చేసుకున్న మార్పుల కార‌ణంగానే క‌న్నాకు కీల‌క ప‌ద‌విని అప్ప‌గించాల్సి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా చేప‌ట్టిన ఎంపిక‌ను విశ్లేషిస్తే.. క‌న్నాకున్న ఇమేజ్ కంటే కూడా సామాజిక స‌మీక‌ర‌ణాలే కీల‌క భూమిక పోషించిన‌ట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News