బీజేపీ-జ‌న‌సేన..అప్పుడే ఎవ‌రి దారి వారిది అయిపోయిందే!

Update: 2020-01-16 16:22 GMT
బీజేపీ - జనసేన భావజాలం ఒక్కటే. ఏపీ భవిష్యత్ కోసమే బీజేపీతో కలిసి ముందుకెళ్తున్నాం. 2024లో జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం` ఇది బీజేపీ-జ‌న‌సేన పొత్తు అనంత‌రం జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ -  బీజేపీ రాష్ట్ర అద్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వెల్ల‌డించిన వివ‌రాలు. సుమారు 3 గంటలపాటు వివిధ అంశాలపై చర్చలు జరిపిన అనంత‌రం ఉమ్మడి మీడియా సమావేశం ఏర్పాటు చేసి దేశ - రాష్ట్ర భవిష్యత్‌ ను దృష్టిలో ఉంచుకుని కలిసి పనిచేస్తామ‌ని పేర్కొన్నారు. అయితే, ఈ సంద‌ర్భంలోనే ఇరు పార్టీల మ‌ధ్య ఇంకా ఐక్య‌తా లోపం ఉంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని అంటున్నారు. దానికి కార‌ణం విలేక‌రుల స‌మావేశంలోని ప్ర‌సంగం తీరే.

పొత్తు కుదుర్చుకున్న నేప‌థ్యంలో కలిసి ఎలా ముందుకెళ్లాలనే దానిపై  బీజేపీ-జ‌న‌సేన పార్టీల నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించిన సంద‌ర్భంగా ప్ర‌ధానంగా రాయ‌ల‌సీమ విష‌యంలో త‌మ అనైక‌త్య‌ను చాటుకున్నారు. క‌ర్నూల్‌లో హైకోర్టు పెట్ట‌డంపై ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌ - జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ క‌ల్యాణ్ ఎవ‌రి వాద‌న‌లు వారు వినిపించారు. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మాట్లాడుతూ... ``రాయ‌ల‌సీమ‌కు హైకోర్టు అంశంలో బీజేపీ - జ‌న‌సేన‌ది ఒకే మాట. మొద‌టి నుంచి రాయ‌ల‌సీమ‌కు హైకోర్టు ఇవ్వాల‌ని మా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇప్పుడూ అదే మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటాం’ అని ప్ర‌క‌టించారు.

అయితే, అనంత‌రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందిస్తూ ఎప్ప‌ట్లాగే త‌న ప్ర‌త్యేక వైఖ‌రిని వెల్ల‌డించారు. హైకోర్టు వస్తే సీమ అబివృద్ధి చెందుతుందో లేదో అక్కడి ప్రజలు ఆలోచించుకోవాలి. హైకోర్టు అనేది త‌న  పరిధిలో ఉన్నదో లేదో వారే స్పష్టతకు రావాలి. మూడు రాజధానులన్నది ప్రజలను మోసం చేయడానికే. మొదట రాష్ట్రం తన అభిప్రాయం చెప్పాలి ’ అని వ్యాఖ్యానించారు. పొత్తు పెట్టుకుంటున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేసిన వేదిక నుంచే..కీల‌క‌మైన రాయ‌ల‌సీమ గురించి రెండ పార్టీల అధ్య‌క్షులు చేసిన ఈ కామెంట్లు..ఆ రెండు పార్టీల భ‌విష్య‌త్ ప్ర‌యాణం ఎలా ఉండ‌నుందో అనే సందేహాన్ని వ్య‌క్తం చేస్తున్నాయ‌ని అంటున్నారు.



Tags:    

Similar News