చంద్రబాబుకు తెలియకుండా స్కామా? జగన్ రైట్: బీజేపీ

Update: 2020-06-12 14:30 GMT
ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు వ్యవహారంలో బీజేపీ స్పందించింది. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని.. అవినీతికి పాల్పడే వారు ఎవరైనా అరెస్ట్ చేయాల్సిందేనని బీజేపీ స్పష్టం చేసింది. ఈ విషయంలో సీఎం జగన్ సరైన నిర్ణయాన్ని తీసుకున్నారని తెలిపింది.

ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు అరెస్ట్ పై తాజాగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. అవినీతికి పాల్పడిన వారు ఎంతటివారైనా ఉపేక్షించడం సరికాదని తెలిపారు. సాక్ష్యాధారాలు ఉంటే వెంటనే అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

ఇక ఇదే విషయంలో బీజేపీ కేంద్రమాజీ మంత్రి, సీనియర్ నాయకురాలు పురంధేశ్వరి కూడా స్పందించారు. ఈ కుంభకోణం కోట్ల రూపాయలదని.. అచ్చెన్నాయుడి పాత్ర ఉన్నట్లు తనకు తెలియదని తెలిపింది. మీడియాలో వార్తలను చూసే తెలుసుకున్నాని పురంధేశ్వరి వ్యాఖ్యానించింది. అవినీతి చేస్తే అరెస్ట్ చేయడం కరెక్టేనని.. అవినీతికి పాల్పడిన వారిని బీజేపీ క్షమించే ప్రసక్తే లేదని పురంధేశ్వరి తెలిపింది.

ఇక ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడి పాత్ర ఒక్కడిదే ఉంటుందని తాను అనుకోవడం లేదని.. చంద్రబాబు ప్రభుత్వంలోని మరికొందరు పెద్ద తలకాయల పాత్ర ఉండే అవకాశాలు కొట్టిపారేయలేమని జీవీఎల్ అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు, లోకేష్ కు తెలియకుండా ఈ కుంభకోణం జరిగి ఉంటుందని తాను అనుకోవట్లేదని జీవీఎల్ ఆరోపించారు. అచ్చెన్నాయుడు ఒక్కడే ఇంత పెద్ద స్కామ్ చేసి ఉంటారంటే తాను నమ్మలేకపోతున్నానని అన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి నిజాలను జగన్ ప్రభుత్వం వెలికితీయాలని కోరారు.


Tags:    

Similar News