ప్ర‌చారాల‌ కోసం కోట్లు ఖర్చు చేస్తారా బాబు?

Update: 2018-10-03 11:22 GMT
ఏపీ సీఎం చంద్ర‌బాబుపై బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కొంత‌కాలంగా విమ‌ర్శ‌నాస్త్రాలు గుప్పిస్తోన్న సంగ‌తి తెలిసిందే. గ‌త నాలుగేళ్ల పాల‌న‌లో చంద్ర‌బాబు చేసిన అవినీతిపై మండిప‌డుతోన్న క‌న్నా ....ప‌లుమార్లు చంద్ర‌బాబుకు ప్రశ్న‌లు సంధించారు. సీఎంగా చంద్ర‌బాబు వైఫల్యం....అవినీతి పాల‌న‌పై క‌న్నా....సీఎంకు బ‌హిరంగ లేఖ‌లు రాస్తున్నారు. ప్రతి వారం 5 ప్ర‌శ్న‌ల‌ను సంధిస్తోన్న క‌న్నా...తాజాగా మ‌రోసారి బాబుక ప్ర‌శ్నాస్త్రాలు సంధించారు. కేంద్రం నుంచి ఏపీకి త‌గిన‌న్ని నిధులు వచ్చాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌ కుమార్ ప్ర‌క‌టించార‌ని, దీంతో కేంద్రంపై చంద్ర‌బాబు చేస్తోన్న ఆరోపణలు, దొంగ దీక్షలు అబ‌ద్ధ‌మ‌ని ప్రజలకు చెంప‌లేసుకొని చంద్ర‌బాబు వివ‌రిస్తారా అని ప్ర‌శ్నించారు. ఏపీలో మట్టి - ఇసుక - గనులను లోకేష్ కబ్జా చేస్తున్నార‌ని, శ్రీకాకుళం జిల్లాలో స‌ముద్రతీరాన ఉన్న వేలాది ఎకరాలను టీడీపీ నాయకులు కబ్జా చేసిన ఆరోప‌ణ‌ల‌పై సీబీఐ విచారణకు సిద్ధమా? అని ప్ర‌శ్నించారు.

చైనాలో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వార్షిక సమావేశంలో లోకేష్ ప్ర‌సంగం ఖర్చు రాష్ట్రంపై ఎందుకు మోపారో చెప్పాల‌ని క‌న్నా ప్ర‌శ్నించారు. లోకేష్ ప్రమోషన్ ఖర్చు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడం లేదా? అని ప్ర‌శ్నించారు. పులిచింతల కాంట్రాక్టర్ కు లబ్ధి చేకూర్చేందుకు విజయవాడలో స్వరాజ్‌ మైదానాన్ని అమ్మ‌కానికి పెట్టార‌ని, ఆ విషయంలో కోర్టుకు వెళ్ల‌లేద‌నేది వాస్తవం కాదా?  అని ప్ర‌శ్నించారు. ఆ కుంభ‌కోణానికి చంద్రబాబు సూత్ర‌ధారి అని ప్ర‌శ్నించారు. అమెరికాలో ప్రకృతి వ్యవసాయంపై ప్ర‌సంగంలో ఏపీలో 5 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు బాబు చెప్పార‌ని, కానీ 1.63 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని వ్య‌వ‌సాయ మంత్రి చెప్పార‌ని అన్నారు. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు చెప్పింది నిజం? ఎవరిది అబద్దం? ప్రజలకు వివరిస్తారా అని క‌న్నా ప్ర‌శ్నించారు.

ఇప్ప‌టికి క‌న్నా 70 ప్ర‌శ్న‌ల‌ను చంద్ర‌బాబుపై సంధించారు. అయితే, వాటిలో వేటికి చంద్ర‌బాబు స‌మాధాన‌మివ్వ‌లేదు. క‌నీసం వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేదు. దీంతో, క‌న్నా చేసిన ఆరోప‌ణ‌లు నిజ‌మేన‌ని ప్ర‌జ‌లు కూడా అభిప్రాయ‌ప‌డే ప‌రిస్థితిని చంద్ర‌బాబు క‌ల్పించారు. నిజంగా ప్ర‌భుత్వ సొమ్ము దుర్వినియోగం చేయ‌క‌పోతే క‌న్నా ఆరోప‌ణ‌లను చంద్ర‌బాబు ఎందుకు ఖండించ‌లేద‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు.
Tags:    

Similar News