జ‌గ‌న్‌ ను విమ‌ర్శించే హ‌క్కు బాబు కోల్పోయిన‌ట్లేనా?

Update: 2018-09-15 04:50 GMT
ప‌రిణామ క్ర‌మంలో కొన్ని ఎపిసోడ్‌ లు అలా జ‌రిగిపోతుంటాయి. అవి కాక‌తాళీయ‌మే అయి ఉండ‌వ‌చ్చు కానీ వాటిని వాడుకునే వారు శుభ్రంగా అదే ప‌నిలో ఉంటారు. అలా వాడుకోబ‌డుతోంది ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ అయితే...ఆ కాక‌తాళీయ సంఘ‌ట‌న ప్ర‌తి శుక్ర‌వారం వైఎస్ జ‌గ‌న్ కోర్టుకు హాజ‌ర‌వ‌డం. దాన్ని ఉప‌యోగించుకుంటూ దుమ్మెత్తిపోస్తోంది తెలుగుదేశం పార్టీ ``వైఎస్ జగన్ కి ప్రతి శుక్రవారం కోర్ట్ డే.. మాకు మాత్రం ప్రతి శుక్రవారం ప్రాజెక్ట్ డే `` అంటూ సంద‌ర్భంగా ఉన్నా లేకున్నా విమ‌ర్శించే తెలుగుదేశం పార్టీకి అదే శుక్ర‌వారం సాక్షిగా షాక్ త‌గిలింది.

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు బాబ్లీ పోరాటం నాటి నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల అంశంలో కోర్టు నోటీసులు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీనిపై సహ‌జంగానే టీడీపీ విరుచుకుప‌డింది. ``ప్రజా సమస్యలపై పోరాడితే ఒక ముఖ్యమంత్రికి నాన్ బెయిలబుల్ నోటీసులు ఇవ్వడం దేశ చరిత్రలోనే ప్రథ‌మం. తక్షణమే నోటీసులు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలి. ఏలాంటి కేసులు లేవని ఇప్పుడు నోటిసులు ఇవ్వడం ఏంటి...?`` అంటూ ఆరోపించింది. అయితే ఇందులో రెండు కీల‌క ట్విస్టులు ఉన్నాయ‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. ఒక‌టి ఈ నోటీసులు వ‌చ్చింది శుక్ర‌వారం. అంటే ఏ రోజు సెంటిమెంట్ ఆధారంగా అయితే జ‌గ‌న్ కోర్టు సెంటిమెంట్‌ ను టీడీపీ వాడుకుంటుందో అదే రోజున చంద్ర‌బాబుకు నోటీసు వ‌చ్చింద‌న్న‌మాట‌. ఇక రెండో అంశం...అనేక నోటీసుల‌కు స్పందించ‌క‌పోవ‌డం వ‌ల్లే...నాన్ బెయిల‌బుల్ వారెంట్  ఇష్యూ అవ‌డం.

ఇదే విష‌యాన్ని బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాకు వెళ్ల‌డించారు. చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ పై స్పందించిన కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుకు నోటీసులు వెనుక మోడీ ఉన్నారు అనేది అవాస్తవమ‌న్నారు. ``2013 నుంచి కేస్ నడుస్తోంది.. అప్పటి నుంచి వారికి నోటీసులు వస్తున్నాయి. 2016 వరకు అప్పుడప్పుడు కోర్టుకు వెళ్తూ వచ్చారు. 22 వాయిదాలకు వెళ్ల‌కపోవడం వలన నానా బెయిల్ బుల్ అరెస్ట్ వారెంట్ వచ్చింది. ముద్దాయిలు 22 సార్లు కోర్టుకు వెళ్ళక పోవడం వలనే వచ్చింది. సాధారణంగా 3 సారు ముద్దాయిలు కోర్ట్ కు వెళ్లక పోతే నాన్ బెయిల్ బుల్ వారెంట్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా నోటిసులు వెనుక మోడీ ఉన్నారని కొత్త డ్రామాలు ఆడుతున్నారు. చంద్రబాబు మీద కేస్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పెట్టింది. ఇప్పుడు అదే పార్టీతో ఆయ‌న అంటకాగుతున్నారు`` అంటూ బాబు ప్ర‌చారానికి ధీటైన కౌంట‌ర్ ఇచ్చారు.
Tags:    

Similar News