సుప్రీం ప్ర‌శ్న‌కు అడిగి చెబుతాన‌న్న సిబల్‌

Update: 2017-05-17 11:18 GMT
ట్రిపుల్ త‌లాక్ పై సుప్రీంకోర్టులో గ‌డిచిన నాలుగు రోజులుగా వాద‌న‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఐదో రోజు ఆస‌క్తిక‌ర వాద‌న‌లు చోటు చేసుకున్నాయి. వాడీవేడీగా సాగుతున్న వాద‌న‌ల న‌డుమ‌.. దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు ఒక ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌ను సంధించింది. క‌ట్టుకున్న భ‌ర్త మూడుసార్లు త‌లాక్ చెప్పేసి విడాకులు తీసుకోవ‌టానికి సిద్ధ‌మైన‌ప్పుడు.. మ‌రి.. ఆ త‌లాక్‌ కు నో చెప్పే హ‌క్కు భార్య‌కు ఉంటుందా? అన్న సందేహాన్ని వ్య‌క్తం చేశారు చీఫ్ జ‌స్టిస్ జ‌గ‌దీశ్ సింగ్ కేహార్‌.

ట్రిపుల్ త‌లాక్ రాజ్యాంగ‌బ‌ద్ధ‌మా? అన్న అంశంపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్న వేళ‌.. ఈ వ్య‌వ‌హారం సుప్రీం చెంత‌కు వెళ్ల‌టం.. త‌లాక్ విధానాన్ని వ‌ద్దని చెప్పేవారు.. కావాల‌నుకునే వారి మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంవాదం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.  భ‌ర్త త‌లాక్ చెప్పి వ‌దిలించుకోవాల‌ని అనుకునే వేళ‌.. దాన్ని నో అని చెప్పే అవ‌కాశం భార్య‌కు ఉంటుందా? త‌లాక్‌ కు భార్య త‌ప్ప‌నిస‌రిగా క‌ట్టుబ‌డి ఉండాలా? అన్న ప్ర‌శ్న‌ల్ని సుప్రీం జ‌డ్జి సంధించారు.
సుప్రీం జ‌డ్జి అడిగిన ప్ర‌శ్న‌కు ఆల్ ఇండియా ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డు త‌ర‌ఫున వాదిస్తున్న సీనియ‌ర్ న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్ స్పందిస్తూ.. కోర్టు సూచించిన స‌వ‌ర‌ణ‌ను లా బోర్డు ప‌రిశీలిస్తుంద‌న్నారు. అయితే..దీనిపై చ‌ర్చ జ‌ర‌గాల‌న్న ఆయ‌న‌.. లాబోర్డును అడిగి చెబుతాన‌న్నారు.

సుప్రీంకోర్టుకు.. క‌పిల్ సిబ‌ల్ కు మ‌ధ్య జ‌రిగిన వాద‌న‌ల అనంత‌రం లా బోర్డు త‌ర‌ఫున వాదిస్తున్న మ‌రో న్యాయ‌వాది యూసుఫ్ ముచాల్లా రియాక్ట్ అవుతూ.. బోర్డుకు సుప్రీం చేసిన స‌ల‌హాల‌ను ఖాజీలు త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. మాన‌వీయ కోణంలో ఉన్న అంశాల్ని మాత్రం లా బోర్డు ప‌రిశీలిస్తుంద‌ని వెల్ల‌డించ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News