ముద్రగడ ఎఫెక్ట్.. కాపుల బ్రేకప్..

Update: 2016-06-11 07:32 GMT
కాపులకు రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తూ కాపు రిజర్వేషన్ ఐక్య వేదిక నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఆ సామాజికవర్గంలో చిచ్చు పెట్టిందా..? కాపులు రెండు వర్గాలుగా చీలిపోయారా? అంటే అవుననే అంటున్నారు ఆ వర్గానికే చెందినవారు.  ముద్రగడ అనుకూల, ముద్రగడ వ్యతిరేక వర్గాలుగా కాపులు చీలిపోయారని... దీంతో కాపుల ఐక్యతకే భంగం వాటిల్లుతోందని అంటున్నారు. దీంతో ముద్రగడ అనుకూల వర్గాలే ప్రభుత్వ అనుకూల - వ్యతిరేక పాత్రను పోషిస్తున్నాయి. ముద్రగడ అరెస్టుకు నిరసనగా కాపు ఉద్యమ నేతలు విజయవాడలో సమావేశం నిర్వహించగా, మంగళగిరిలో ముద్రగడ వ్యతిరేక కాపు వర్గం సమావేశం నిర్వహించింది. దీంతో ముద్రగడను అరెస్టు చేయడంలో నైతికతను పలువురు కాపు నేతలు ప్రశ్నిస్తుండగా, రెండో వర్గం ప్రభుత్వ అరెస్టులకు అడ్డుపడడం న్యాయమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ కీలక మలుపులు ఎటువైపుకు దారితీయనున్నాయోనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.
    
అయితే.. వైసీపీలోని కాపు నేతలు మాత్రం ముద్రగడకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. రాజమండ్రి ఆసుప‌త్రిలో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష కొన‌సాగిస్తోన్న కాపు నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంను ప‌రామ‌ర్శించేందుకు వైసీపీ నేత‌లు వెళ్తున్నారు. ముద్రగడను పరామర్శించేందకు వెళ్తున్నవారిలో బొత్స సత్య‌నారాయ‌ణ‌ - ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా - ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు - అంబటి రాంబాబు తదితరులు ఉన్నారు.  ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం తన ఉద్యమానికి ముందు రాష్ట్రంలోని ముఖ్య‌మైన ప్ర‌తిప‌క్ష‌నేత‌లంద‌ర్నీ క‌లసిన విష‌యం తెలిసిందే. సామాజికవర్గం పరంగా రాజకీయంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నందున వైసీపీ నేతలు ముద్రగడకు సంఘీభావంగా వెళ్తున్నారు. మరోవైపు  కాంగ్రెస్ లోని కాపు నేతలూ దీనిపై స్పందిస్తున్నారు.  రాజ్యసభ సభ్యుడు - సినీన‌టుడు చిరంజీవిని ఇందులోకి లాగి ఉద్యమ వేగం పెంచేందుకు యత్నిస్తున్నారు. ఏపీ శాస‌న‌మండ‌లి ప్ర‌తిప‌క్ష స‌భ్యుడు సి.రామ‌చంద్ర‌య్య తాజాగా చిరంజీవిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.. ముద్ర‌గ‌డ తనను పోలీసులు అరెస్టు చేసిన త‌రువాత కూడా ఆసుప‌త్రిలో దీక్ష కొన‌సాగిస్తోన్న  క్ర‌మంలో ఏం చేయాలనే విషయమై  చిరంజీవితో సి.రామ‌చంద్ర‌య్య చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది.  మొత్తానికి చంద్రబాబుకు వ్యతిరేకంగా ముద్రగడకు అనుకూలంగా విపక్ష కాపు నేతలు ఏకమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
    
మరోవైపు టీడీపీలో ఉన్న ప్రధాన కాపు నేతలు, కాపు మంత్రులంతా ముద్రగడ తీరును తప్పు పడుతున్నారు. ముద్రగడ కీలక పాత్ర పోషిస్తున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం చినరాజప్ప.. పొరుగు జిల్లా విశాఖకు చెందిన మంత్రి గంటాలు ముద్రగడపై విరుచుకుపడుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి నారాయణ కూడా ముద్రగడ వైఖరిని నిరసిస్తున్నారు. శ్రీకాకుళం - పశ్చిమగోదావరి - రాయలసీమ జిల్లాలకు చెందిన ప్రధానమైన కాపు నేతలంతా కూడా ముద్రగడ తీరు కాపుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో కాపుల మధ్య భారీ చీలిక ఏర్పడిందనే చెప్పాలి.
Tags:    

Similar News