కాపులు దిమ్మ‌తిరిగే వ్యూహం రెడీ చేశార‌ట బాబు

Update: 2017-08-02 08:12 GMT
మాజీ మంత్రి ముద్రగడ ప‌ద్మ‌నాభం నేతృత్వంలో కిర్లంపూడి నుండి అమరావతి వరకు తలపెట్టిన పాదయాత్రను పోలీసులు ఉక్కుపాదంతో అణచివేయడంతో కాపులు త‌మ త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ కోసం క‌స‌రత్తు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ముద్రగడను కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో గృహనిర్బంధం చేసిన సంగతి తెలిసిందే. అయితే గృహనిర్బంధ గడువు ముగిసినా మరోమారు ఆయన్ని గృహనిర్బంధం చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తుందన్న భావన కాపు నేతల్లో ఉంది. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలన్న ఆలోచనలో కాపు నేతలు ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేక వ్యూహాన్ని కూడా రచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప‌శ్చిమగోదావ‌రి జిల్లాకు చెందిన కాపు నేతలు కలెక్టరేట్ ముట్టడికి వ్యూహం రచిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను మరోమారు గృహ నిర్బంధం చేస్తే జిల్లా కలెక్టరేట్‌ ను ఉమ్మడిగా ముట్టడించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు పది వేల మందితో ఈ ముట్టడికి కాపు నేతలు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని జిల్లాల్లోను ఈ విధంగా కలెక్టరేట్ ముట్టడి చేస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందన్నది కాపు నేతల ఆలోచనగా కనిపిస్తోంది. ఒకవేళ ముద్రగడ పద్మనాభంను చలో అమరావతి పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇస్తే ఆయన పాదయాత్రలో కాపు నేతలు భాగస్వాములు అవుతారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పాదయాత్రను అమరావతి వరకు తీసుకువెళ్ళాలని కాపునాడు తీర్మానించినట్టు సమాచారం.

కాగా, కాపులను బీసీల్లో చేరుస్తానని ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీనే అమలు చేయాలని తమ జాతి నాయకుడు ముద్రగడ పద్మనాభం సారథ్యంలో గత రెండు సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్న సీఎం చంద్రబాబు స్పందించకపోవడం కాపు - బలిజ - ఒంటరి - తెలగ జాతిని అవమానించడమేనని కాపు జేఏసీ కార్యవర్గం అభిప్రాయపడింది. కిర్లంపూడి విలేఖరుల సమావేశంలో కాపు జేఏసీ నేత‌లు మాట్లాడుతూ ముద్రగడ నేతృత్వంలో కిర్లంపూడి నుండి అమరావతి వరకు తలపెట్టిన పాదయాత్రను పోలీసులు ఉక్కుపాదంతో అణచివేయడం కాపుజాతి గొంతు నొక్కడమేనని అన్నారు. తమ జాతి ఓట్లతో అధికారం చేపట్టి తమనే అణగదొక్కడం ఎక్కిన కొమ్మనే నరకడం వంటిదని వారు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు చర్యలను కాపులు గమనిస్తున్నారన్నారు. ముఖ్యంగా జాతి మహిళలు రోడ్డు మీదకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని నిలదీస్తూ ఆందోళనలు చేస్తున్నారన్నారు. ముద్రగడ పాదయాత్రను పోలీసులు నిర్భందించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోను వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారన్నారు. కోనసీమలో కాపు మహిళలను మగ పోలీసులు జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లిన సంఘటన మహిళలు మరువరని, రాబోయే రోజుల్లో మహిళలంతా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లువేసి ఆయన పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకు శపథం చేస్తున్నారన్నారు.

గతంలో ఎపుడూ కనీ వినీ ఎరుగని రీతిలో కాపు ఉద్యమం ఉవ్వెత్తున లేచిందని కాపు జేఏసీ కన్వీనర్ ఆకుల రామకృష్ణ అన్నారు. ఉద్యమం ప్రారంభించి రెండేళ్లయినా కాపులకు ఇస్తానన్న బీసీ రిజర్వేషన్ ప్రక్రియ అంగుళం కూడా ముందుకు కదలలేదన్నారు. 2015 ఫిబ్రవరి నెలలో ముద్రగడ కుటుంబం కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌ తో ఆమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భంలో ప్రభుత్వమే మంత్రులను పంపి ఏడు నెలల్లోగా మంజునాథ్ కమిషన్ రిపోర్టు తెప్పించుకుని కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆ హామీ ఈ ఆగస్టు నెలకు సంవత్సరం అయినా ఆచరణకు నోచుకోలేదన్నారు. చంద్రబాబుకు కాపు మంత్రులతో ఉద్యమంపై ఎదురుదాడి చేయించడం అలవాటుగా మారిందన్నారు. మంత్రులు చంద్రబాబుకు భజన చేయవచ్చు గానీ, జన్మనిచ్చిన కులానికి వ్యితిరేకంగా విమర్శలు చేయడం పాలు తాగి రొమ్ము గుద్దిన చందాన ఉందని వారు విమర్శించారు. ఇటువంటి కాపు మంత్రులను చరిత్ర క్షమించదని విమర్శించారు. ప్రభుత్వమే తునిలో రైలు సంఘటన జరిపించి కాపుజాతిపై నెట్టడం ఆ సంఘటనే బూచిగా చూపించి కాపుజాతి పాదయాత్రను జాతి ప్రజలకున్న స్వేచ్ఛకు భంగం కలిగించడం రాజ్యాంగ విరుద్ధమని వారు విమర్శించారు. ఉద్యమాన్ని పోలీసు ఉక్కుపాదంతో అణచివేయడం యావత్తు జాతి గమనిస్తోందని వారన్నారు. ఆగస్టు 2వ తేదీ వరకు జిల్లా కలెక్టర్, ఎస్పీల ఆదేశాల మేరకు తమ నాయకుడు ముద్రగడ గృహ నిర్బంధంలోనే ఉంటారని, ఆగస్టు 3వ తేదీన తిరిగి అమరావతికి నిరవధిక పాదయాత్ర ప్రారంభం అవుతుందని కాపు జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.
Tags:    

Similar News