ఆమంచి ఎగ్జిట్‌!..చీరాల టీడీపీలో ర‌చ్చ రంబోలా!

Update: 2019-02-13 09:50 GMT
ఎన్నిక‌లు త‌రుముస‌స‌కొస్తున్న కీల‌క త‌రుణంలో ఏపీలో అధికార పార్టీ టీడీపీలో నిజంగానే ర‌చ్చ ర‌చ్చ చోటుచేసుకునే అవ‌కాశాలే క‌నిపిస్తున్నాయి. ఈ త‌ర‌హా ప‌రిస్థితికి... ప్ర‌కాశం జిల్లా చీరాల‌లో ప్ర‌స్తుతం చోటుచేసుకున్న ప‌రిస్థితులే నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయ‌ని చెప్పాలి. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్ ఆశించి... చంద్రబాబు చేతిలో అవ‌మానానికి గురైన ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌... ఇండిపెండెంట్‌ గా పోటీ చేశారు. ప్ర‌జ‌ల్లో త‌న ప‌ట్ల ఉన్న సానుకూల‌త‌ను ఆధారంగా చేసుకుని స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగినా... ఆమంచి ఘ‌న విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత ఆయ‌న టీడీపీలో చేరిపోయారు. అయితే ఇప్పుడు టీడీపీలో కొన‌సాగుతున్న కులాధిప‌త్యంపై క‌త్తి దూసిన ఆమంచి... నేటి ఉద‌యం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేసి పారేసి... కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి హైద‌రాబాద్‌ లో ప్ర‌త్య‌క్ష‌మైన ఆమంచి నేరుగా లోట‌స్ పాండ్ కు చేరుకున్నారు. వైసీపీ అధినేత‌న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో భేటీ అయ్యారు. కుటుంబ స‌భ్యుల‌ను - త‌న ముఖ్య అనుచ‌రుల‌ను జ‌గ‌న్‌ కు ప‌రిచ‌యం చేసిన ఆమంచి తాను వైసీపీలో చేరుతున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు తీరుపై ఆమంచి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇదంతా హైద‌రాబాద్‌ లో జ‌రుగుతున్న సీన్ కాగా... ఇటు చీరాల‌లో దానికి భిన్న‌మైన మ‌రో సీన్ ఎంట్రీ ఇచ్చేసింది. ప్రకాశం జిల్లా టీడీపీలో మోతుబ‌రిగా పేరుగాంచిన ఎమ్మెల్సీ క‌ర‌ణం బ‌ల‌రాం వ‌ర్గం చీరాల‌లో ఎంట్రీ ఇచ్చింది. *తిర‌గ‌బ‌డ్డ తెలుగు బిడ్డ‌* అంటూ క‌ర‌ణం పేరిట బ‌ల‌రాం ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ తెలుగు బిడ్డ ఎందుకు తిర‌గ‌బ‌డ్డార‌న్న విష‌యాన్ని చెప్ప‌డం మానేసి... చీరాల‌లోకి క‌ర‌ణం ఎంట్రి ఇస్తున్న విష‌యాన్ని ఆయన వ‌ర్గం ఘ‌నంగా ప్ర‌క‌టించింది. అయినా ఇప్పుడు టీడీపీకి ఆమంచి రాజీనామా ఎందుకు చేశార‌న్న విష‌యానికి వ‌స్తే... గ‌డ‌చిన ఎన్నికల్లో టీడీపీ త‌ర‌ఫున త‌న‌పై పోటికి దిగిన పోతుల సునీత‌ను ఆమంచి చిత్తుచిత్తుగా ఓడించారు. అయితే త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన పోతుల‌కు చంద్ర‌బాబు పెద్ద పీట వేశారు. అక్క‌డ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి టీడీపీలో చేరినా కూడా... ఆయ‌న‌ను ప‌క్క‌న‌పెట్టి పోతుల సునీత‌కు చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇవ్వ‌డం మొద‌లెట్టారు. మొన్నామ‌ధ్య ఎమ్మెల్సీగా ఆమెకు అవకాశం క‌ల్పించిన చంద్ర‌బాబు... ఇటీవ‌లే ఏకంగా తెలుగు మ‌హిళ రాష్ట్ర అధ్య‌క్షురాలిగా ప‌దోన్న‌తి క‌ల్పించారు.

ఈ క్ర‌మంలో ఆమంచిని పూర్తిగా ప‌క్క‌న‌పెట్టేసిన చంద్ర‌బాబు... వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ పోతుల‌కే సీటు ఇస్తార‌న్న దిశ‌గా సాగారు. ఈ విష‌యాన్ని గ్ర‌హించిన ఆమంచి... పార్టీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు త‌న‌దైన రాజీ ఫార్ములాను అమలు చేసినా... ఆమంచి పార్టీని వీడారు. అంటే మొత్తంగా ఆమంచిని చంద్ర‌బాబు దూరం చేసుకోవ‌డానికి కార‌ణం పోతుల సునీత‌. ఇక్క‌డ ఇస్తే గిస్తే.... పోతుల సునీత‌కు ప్రాధాన్యం ఇస్తారు. మ‌రి ఇలాంటి కీల‌క త‌రుణంలో క‌ర‌ణం బ‌ల‌రాం ఎంట్రీ ఇవ్వ‌డం చూస్తుంటే... మ‌ళ్లీ అక్క‌డ అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు త‌ప్ప‌వ‌న్న వాద‌న వినిపిస్తోంది. అంతేకాకుండా మృదు స్వ‌భావిగా క‌నిపించే ఆమంచి ఉన్న‌ప్పుడే పోతుల సునీత‌తో పోటీ నేప‌థ్యంలో  అమంచి ర‌చ్చ రచ్చ జ‌రిగితే... ఆది నుంచి దుందుడుకు స్వ‌భావం ఉన్న క‌ర‌ణం బ‌ల‌రాం ఎంట‌రైతే... చీరాల‌లో ఇక ర‌చ్చ రంబోలాగానే మారే ప్ర‌మాదం లేక‌పోలేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News