కరణం కెలుకుడు...రాయలసీమ రగులుడు...

Update: 2022-10-10 03:55 GMT
ఏపీ రాజధానిగా అమరావతిని చంద్రబాబు ఉంచారు. దానికి ఆనాడు అందరూ ఓకే చెప్పారు. అయితే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అంటూ కొత్త నినాదం తీసుకున్నారు. ఆయన కర్నూల్ కి హై కోర్టు విశాఖకు పరిపాలనా రాజధాని అని చెప్పి ఈ మూడు రాజధానుల మీద తమదైన రాజకీయ వ్యూహాన్ని ముందుకు తెచ్చారు.

అయితే మూడు రాజధానుల విషయంలో ఇప్పటిదాకా ఒక్క వైసీపీ తప్ప మిగిలిన పార్టీలేవీ సుముఖంగా లేవు. అదే టైం లో అమరావతి రాజధాని రైతుల పాదయాత్రకు అన్ని విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. విశాఖ రాజధాని కావాలని ఒక వైపు రౌండ్ టేబిల్ సమవేశాలు జరుగుతున్నాయి. ఇపుడు ఆ వేడిని మరింత పెంచే విధంగా  విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే  కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

ఆయన తాను రాజీనామాకు కట్టుబడి ఉన్నానని, తనది డ్రామా కాదని, ఇప్పటికే స్పీకర్ తో ఈ విషయం మీద మాట్లాడాను అని చెప్పారు. అంతే కాదు అమరావతి రాజధానిని కోరే టీడీపీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని సవాల్ చేశారు. మరి ఇది వ్యూహాత్మకగా లేక ఉద్యమాన్ని మరింత హీటెక్కించడానికి చేశారా తెలియదు కానీ కరణం రాజీనామాతో ఉత్తరాంధ్రా రాజకీయాల్లో కొంత అలజడి పుట్టింది.

అయితే కరణం రాజీనామా తాలూకా ప్రకంపనలు ఉత్తరాంధ్రా కంటే రాయలసీమలో గట్టిగా ఉన్నాయి. రాయలసీమకు హై కోర్టు ఏంటి ఏకంగా రాజధాని రావాలని కావాలని అక్కడ వారు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఉంటే అమరావతి రాజధాని ఉంచండి లేకపోతే కర్నూల్ కే ఆ రాజధానిని తీసుకురండి అని కూడా వారు కోరుతున్నారు. సరిగ్గా ఈ పాయింట్ ని పట్టుకునే బీజేపీ నేత, జామీ ఎంపీ టీజీ వెంకటేష్ రాయలసీమకు ఎందుకు రాజధాని రాకూడదు అని ప్రశ్నించారు.

విశాఖ రాజధాని కోసం ఉత్తరాంధ్రా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తూంటే రాయలసీమ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయరని ఆయన నిలదీశారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూల్ కే రాజధాని రావాలని ఆయన చరిత్ర విప్పి మరీ చెబుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి రాజధాని కోసం పట్టుపట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

మరి నిజంగా కనుక సీమ  వైసీపీ ఎమ్మెల్యేలు విశాఖ రాజధాని విషయంలో భిన్నాభిప్రాయాలతో ఉన్నారని అంటున్నారు. వారు కనుక దూకుడు  చేసి రాజీనామాలు చేస్తే అపుడు వైసీపీ సర్కార్ ఇరకాటంలో పడడం ఖాయమనే అంటున్నారు. విశాఖ కావాలా కర్నూల్ కావాలా అంటే తేల్చుకోలేని పరిస్థితి వైసీపీకే వస్తుందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మూడు ముక్కలాట ద్వారా రాజకీయ లాభాన్ని పొందాలని చూస్తున్న వైసీపీ తానే చివరికి కార్నర్ అవుతుందా అన్నదే చర్చగా ఉంది మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News