వైసీపీ లోకి ఆ టీడీపీ సీనియర్ ఫ్యామిలీ.....ఆఫర్ ఇదే..?

Update: 2019-11-23 10:54 GMT
టీడీపీ కి ఓ సీనియర్ నేత ఫ్యామిలీ షాక్ ఇవ్వనుందా ? అంటే ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుసగా టీడీపీ నేతలు వైసీపీ లేదా బీజేపీ ల్లోకి వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక మరికొందరు నేతలు కూడా ఇదే పనిలో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఆ పార్టీ తర‌పున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారనున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ ని వీడారు. ఆయన త్వరలోనే వైసీపీ తీర్ధం పుచ్చుకొనున్నారు.

అలాగే విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం జరుగుతున్న సమయంలోనే టీడీపీకి మరో పిడుగు లాంటి వార్త తెలిసింది. ఆ పార్టీకి ఎప్పటి నుంచో అండగా ఉంటున్న సీనియర్ నేత, ప్ర‌కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఫ్యామిలీ కూడా వైసీపీలో వెళ్లనున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన తనయుడు వెంకటేష్ భవిష్యత్తు కోసం పార్టీ మారనున్నారని తెలుస్తోంది.

కరణం కు మామూలుగానే ప్రకాశం జిల్లా వైసీపీ నేతలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఇటీవల ఆయన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. అలాగే తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మనవడి పుట్టినరోజు వేడుకలకు కూడా హాజరయ్యారు. ఈ వేడుకల్లోనే కరణంతో...మంత్రి బాలినేని, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీలోకి తీసుకురావడానికి చర్చలు చేసినట్లు సమాచారం.

ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో వెంకటేష్ కు అద్దంకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కరణం మాత్రం ఇప్పుడు ప్రకాశం జెడ్పీ చైర్మ‌న్ సీటుతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అద్దంకి సీటు కూడా ఇవ్వాలని చెప్పినట్లు సమాచారం. కానీ అందుకు వైసీపీ వర్గాలు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఇప్పుడు కుదిరితే ఒంగోలు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని, అలాగే వచ్చే ఎన్నికల్లో అద్దంకి సీటు గ్యారెంటీగా ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. అయితే కరణం దీనికి ఓకే చెప్పకుండా ఆలోచించుకుని చెబుతానని చెప్పినట్లు సమాచారం. భవిష్యత్తు లో టీడీపీ పరిస్థితి చూశాక క‌ర‌ణం తో పాటు ఆయ‌న‌ తనయుడు తో పార్టీ మారే అవకాశముందని తెలుస్తోంది.


Tags:    

Similar News