మంత్రిని ఢీకొన్న కలెక్టర్.. పోస్ట్ ఊస్ట్..!

Update: 2019-12-16 10:55 GMT
కరీంనగర్ కలెక్టర్ అనూహ్యంగా బదిలీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ గెలుపునకు సహకరించి సిట్టింగ్ ఎమ్మెల్యే కం మంత్రికి వ్యతిరేకంగా లాబీయింగ్ చేసినట్టు లీకైన కలెక్టర్ ఫోన్ ఆడియో వ్యవహారంమే ఆయన బదిలీకి కారణమని అంటున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం కలెక్టర్ పై చర్యలు తీసుకుందంటున్నారు. కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ లో పోటీచేసిన టీఆర్ ఎస్ అభ్యర్థి గంగుల - బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ హోరా హోరీగా తలపడ్డారు.  గంగులపై అనర్హత కేసు వేసేందుకు కలెక్టర్ సర్ఫరాజ్ ఆయన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ సహకారం అందించారని ఒక ఆడియో క్లిప్ లో బయటపడింది. ఆ వ్యాఖ్యలు కలకలం రేపాయి. గంగులకు వ్యతిరేకంగా.. బీజేపీ ఎంపీ సంజయ్ కు అనుకూలంగా కలెక్టర్ వ్యవహరించినట్టు ఆ ఆడియోలో వెల్లడైంది.

ఇక ప్రభుత్వ వ్యవహారాల్లో జిల్లా మంత్రులు ఈటల రాజేందర్ - గంగుల కమలాకర్ లతో కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కు విభేదాలు తలెత్తాయి..  టీఆర్ ఎస్ ఎమ్మెల్యే రసమయితోనే కలెక్టర్ గొడవపడ్డారు.  దీంతో టీఆర్ ఎస్ పార్టీ నేతలు కలెక్టర్ వ్యవహారశైలిపై సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. ఇక మంత్రి గంగులకు వ్యతిరేకంగా సాగించిన ఆడియో క్లిప్ పై కూడా ప్రభుత్వం విచారించి ఎట్టకేలకు కలెక్టర్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న కలెక్టర్ సర్ఫరాజ్ ఉంటే ఇబ్బందులు తప్పవని గ్రహించిన టీఆర్ ఎస్ సర్కారు ఆయనను బదిలీ చేసిందని ప్రచారం జరుగుతోంది.  ఆయన స్థానంలో కరీంనగర్ కొత్త కలెక్టర్ గా శశాంకను నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News