కర్ణాటక : రెబెల్స్ కు స్పీకర్ హెచ్చరిక లాంటి ఆదేశం!

Update: 2019-07-09 12:29 GMT
కర్ణాటక రాజకీయంలో ఇప్పుడు స్పీకర్ దే కీలకమైన పాత్ర అవుతుందని వేరే చెప్పనక్కర్లేదు. ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి రాజీనామా పత్రాలు ఇచ్చి క్యాంపులకు తరలి వెళ్లారు. ఆ క్యాంపులను ఎవరు నిర్వహిస్తున్నారు? అనేది ఒక రహస్యంగానే ఉంది.

ఎమ్మెల్యేలేమో తామే స్వచ్చంధంగా తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. వారిని బుజ్జగించడానికి ముఖ్యమంత్రి కుమారస్వామి గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్నారు. కేబినెట్ మొత్తాన్నీ రద్దు చేశారు. రెబెల్స్ తిరిగి వస్తే వారికి చెప్పి కొత్త కేబినెట్ ను వారి ఇష్టానికి అనుగుణంగా ఏర్పాటు చేయబోతున్నట్టు బుజ్జగింపులు సాగుతూ ఉన్నాయి.

మరి ఆ బుజ్జగింపులకు రెబెల్స్ ఎంత వరకూ మెత్తబబడతారు? అనేది మాత్రం సందేహంగానే ఉంది. ఆ సంగతలా ఉంటే రాజీనామా అంటూ రాష్ట్రాన్ని దాటి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలకు స్పీకర్ రమేశ్ కుమార్ ఒక హెచ్చరిక లాంటి ఆదేశాలు ఇచ్చారు. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది దాఖలు చేసిన పత్రాలు సరిగా లేవని స్పీకర్ తేల్చారు. వారి రాజీనామాలు సరైన ఫార్మాట్లో లేవని ఆయన తేల్చేశారు.

రాజీనామా చేయాలనుకుంటున్న వారు ఎవరైనా వచ్చి తనతో వ్యక్తిగతంగా సమావేశం కావాలని రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. అందుకు తేదీలను కూడా ప్రకటించారాయన.

12-13-15 తేదీల్లో ఎమ్మెల్యేలు వచ్చి తనను కలవాలని, రాజీనామాలపై వివరణ ఇవ్వాలని ఆయన ప్రకటించారు. ఇలా రాజీనామాలను ఆమోదించడంపై తన వైఖరిని ప్రకటించారు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్. మరి దీనిపై ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారో!
Tags:    

Similar News