అల్లర్లతో ఉడికిపోతున్న కర్ణాటక - హిడెన్ అజెండా?

Update: 2022-02-10 03:30 GMT
కాలేజీల్లో మొదలైన వివాదంతో కర్ణాటక ఉడికిపోతోంది. ముస్లిం విద్యార్ధినులు ధరించే హిజాబ్ పాయింట్ గా ఉడిపిలో మొదలైన వివాదం ఇపుడు ఆరు జిల్లాలకు చేరుకుంది. హిజాబ్ వివాదంలో బీజేపీ మద్దతుతో విద్యార్థి సంఘాలు ఎంటర్ అవటంతో చాలా కాలేజీల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీని ఫలితంగా చాలా కాలేజీల్లో విద్యార్థుల మధ్య ఘర్షణలు, పోలీసుల లాఠీ ఛార్జీలు జరగటంతో తాత్కాలికంగా కాలేజీలను మూసేయాల్సొచ్చింది.

 మొన్న జనవరిలో ఉడిపిలో ఉన్న ప్రభుత్వ కాలేజీకి ఆరుగురు ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించి వచ్చారు. అయితే వీళ్ళని కాలేజీ ప్రిన్సిపల్ అనుమతించలేదు. హిజాబ్ ధరించి ముస్లిం విద్యార్ధినులు ఎందుకు కాలేజీకి రాకూడదో ప్రిన్సిపల్ చెప్పలేకపోయారు.

దాంతో మిగిలిన ముస్లిం అమ్మాయిలు కూడా నిరసన మొదలుపెట్టారు. దీంతో ముస్లిం విద్యార్ధినులకు వ్యతిరేకంగా హిందూ విద్యార్ధులు ఎంటరయ్యారు. హిందువుల విద్యార్థులు కాషాయ బట్టలు, కండువాలు ధరించి కాలేజీకి హాజరయ్యారు.

 ఫలితంగా రెండు వర్గాల మధ్య మొదలైన గొడవలు చివరకు బాగా పెద్దవైపోయాయి. ఉడిపిలో మొదలైన గొడవ చివరకు బాగల్ కోటె, దావణగెరె, మాండ్య, బెళగావి, శివమొగ్గ, చిక్కమగళూరు, రాయచూరు, కుంబరిగి, కోలారు జిల్లాల్లోని కాలేజీలకూ పాకింది. ఇదంతా చూస్తుంటే ఈ వివాదం వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఎందుకంటే ఉడిపిలో వివాదం మొదలైంది కాలేజీ యాజమాన్యానికి ఆరుగురు ముస్లిం విద్యార్ధినులకు. వాళ్ళ మధ్య మొదలైన సమస్యను వాళ్ళే పరిష్కరించుకుంటారు. మరి మధ్యలో మిగిలిన విద్యార్థులు వివాదంలోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరమే లేదు. అయినా ఎంటరై ఇంతటి వివాదానికి కారణమయ్యారంటేనే హిడెన్ అజెండా ఉందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

హిజాబ్ విదాంలోకి రాజకీయ పార్టీలు కూడా ఎంటరైపోయాయి. ముస్లిం అమ్మాయిలకు ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ మద్దతుగా మాట్లాడారు. అలాగే కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా రంగంలోకి దిగేశారు. మరి రోజు రోజుకు పెరిగిపోతున్న వివాదాన్ని ప్రభుత్వం, కోర్టు ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.



Tags:    

Similar News