హనుమంతుడి జన్మస్థలం.. ఈసారి కెలికింది ఆ సీఎమ్మే

Update: 2022-08-02 04:40 GMT
పురాణాలు నిజమా? కాదా? అన్నదే పెద్ద చర్చ. ఇక.. పురాణాల్లో పేర్కొనే వారు నిజంగా ఉన్నారా? లేరా? అన్నది మరో ప్రశ్న. దీనిపై ఎవరికి వారు వారిదైన వాదనల్ని వినిపిస్తుండటం తెలిసిందే. ఎంతకూ తేలని కొన్ని అంశాల్ని అనవసరంగా ప్రస్తావిస్తూ.. తెర మీదకు తీసుకురావటం తప్పే అవుతుంది.

ఈ మధ్యనే హనుమంతుడి జన్మస్థలం మీద రచ్చ జరగటం.. ఎవరికి వారు తమదైన వాదనల్ని వినిపించటం.. వాతావరణం వేడెక్కటం తెలిసిందే. సమిసిపోయిన ఆ ఇష్యూను మరోసారి కెలికేశారు ఈ మధ్యనే హనుమంతుడి జన్మస్థలం తిరుమల అని గత ఏప్రిల్ లో టీటీడీ ప్రకటించటం.. దానికి ఆధారంగా కొన్ని వివరాల్ని వెల్లడించటం తెలిసిందే.

పురాణాల్లోనూ హనుమంతుడి జన్మస్థలం మీద వాదన ఉందని చెప్పుకు రావటం.. దీనిపై మీడియాలోనూ పెద్ద ఎత్తున కథనాలు రావటం తెలిసిందే అయితే.. టీటీడీ వాదనలో పస లేదంటూ తేల్చేస్తూ.. కర్ణాటకలోని కిష్కంధ ట్రస్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.

అంతేకాదు.. హనుమంతుడి జన్మస్థలం.. కిష్కింధ అంటూ వాదనలు వినిపించింది. ఇలాంటివేళలోనే మరొకరు నాసిక్ సమీపంలోని అంజనేరి ఆంజనేయుడి జన్మస్థలంగా పేర్కొనటం తెలిసిందే.

ఇలా ఎవరికి వారు.. తమకు నచ్చిన వాదనను వినిపిస్తున్న వేళ.. ఇష్యూ కాస్తంత రాజుకొని.. ఆ తర్వాత చల్లారింది. ఇలాంటి వేళ మరోసారి ఎంట్రీ ఇచ్చారు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. తాజాగా ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ.. కొప్పాల్ జిల్లాలోని అంజనాద్రి కొండలు హనుమంతుడి జన్మస్థలంగా గుర్తింపు పొందినట్లుగా పేర్కొన్నారు.

ప్రస్తుతం హంపికి దగ్గర్లోని అంజనాద్రి కొండల్లో హనుమతుడు పుట్టినట్లుగా పేర్కొన్న ఆయన.. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్నారు. ఆంజనేయుడు అక్కడ పుట్టారు.. ఇక్కడ పుట్టారని చాలామంది చెబుతుంటారని.. కానీ అవేమీ నిజం కావన్నారు. ఆంజనేయుడు పుట్టింది కిష్కింధలోని అంజనాద్రి కొండల్లోనే అంటూ ఆయన వాదనలు వినిపిస్తున్నారు. తాను చెప్పిన విషయంపై ఎలాంటి గందరగోళం లేదన్న కర్ణాటక సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరో కొత్త చర్చకు తెర తీస్తాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News