ధూమ్‌ ధామ్‌గా ఎమ్మెల్యే కొడుకు పెళ్లి: గిఫ్ట్‌గా పాజిటివ్‌

Update: 2020-07-17 15:50 GMT
శుభ‌కార్యాలు.. విందులు.. వినోదాలు.. స‌మావేశాలు ఈ స‌మ‌యంలో వ‌ద్ద‌ని.. ఒక‌వేళ చేసుకున్నా ప‌రిమిత సంఖ్య‌లో జ‌నాలు ఉండేలా చూసుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాలు ఉన్నాయి. కానీ వీటిని కొంద‌రు య‌థేచ్ఛ‌గా ఉల్లంఘిస్తున్నారు. ఫ‌లితంగా వైర‌స్ వ్యాపించి వారికి త‌గిన విధంగా బుద్ధి చెబుతోంది. తాజాగా కర్ణాటకలో ఓ ఎమ్మెల్యే త‌న ప‌లుకుడి.. రాజ‌కీయం చూపించి అంగ‌రంగ వైభ‌వంగా కుమారుడి వివాహం చేశాడు. ఆ వైర‌స్ నువ్వు ఎవ‌రైతే ఏంట‌ని.. ఏకంగా సీనియ‌ర్ ఎమ్మెల్యేకు సోకింది. దీంతో సంతోషాల న‌డుమ ఉండాల్సిన ఇల్లు ఇప్పుడు భ‌యాందోళ‌న‌లో ప‌డింది.

బళ్లారి జిల్లాలోని హూవిన హడగలి నియోజక వర్గం ఎమ్మెల్యే (కాంగ్రెస్) పీటీ. పరమేశ్వర్ నాయక్ సీనియ‌ర్ నాయ‌కుడు. మాజీ మంత్రి. క‌ర్నాట‌క‌లో కీల‌క నాయ‌కుడు. ఆ జిల్లాలో అత‌డికి బాగా ప‌లుకుబ‌డి ఉంది. అత‌డి కుమారుడు అవినాశ్‌. రాజకీయాల‌తో పాటు అనేక వ్యాపారాలు చేస్తూ తండ్రిగా మారాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఈ క్ర‌మంలో జూన్ 15వ తేదీన త‌న స్వ‌గ్రామం లక్ష్మీపురంలో ఎమ్మెల్యే పరమేశ్వర్ నాయక్ త‌న కుమారుడు అవినాశ్ వివాహం వైభ‌వంగా చేశాడు. దీనికి అతిర‌థ మ‌హార‌థులంద‌రూ త‌ర‌లివ‌చ్చారు. మాజీ ముఖ్య‌మంత్రి సిద్దరామయ్య, ప్రస్తుత మంత్రి బళ్లారి శ్రీరాములుతో పాటు మాజీ మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ప్ర‌జాప్ర‌తినిధులు.. ఇత‌ర పార్టీల నాయ‌కులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. నాయ‌కులు ఉంటే హ‌డావుడి ఉంటుంది క‌దా.. అందుకే ఈ పెళ్లిలో వైర‌స్ ప్ర‌బ‌లుతుంద‌నే విష‌యం మ‌ర‌చి అంద‌రూ గుంపుగుంపులుగా ఉండ‌డం.. భౌతిక దూరం పాటించ‌క‌పోవ‌డం.. మాస్క్‌లు ధ‌రించ‌క‌పోవ‌డం వంటివి జ‌రిగాయి. దీని ఫ‌లితంగా పెళ్లి జ‌రిపించిన ఎమ్మెల్యే ప‌ర‌మేశ్వ‌ర్‌కే వైర‌స్ సోకింది.

పెళ్లిలో కేంద్ర ప్రభుత్వ నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డంతో ఎమ్మెల్యే పరమేశ్వర్ నాయక్ పై లక్ష్మీపురం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. అప్పట్లోనే అత‌డిపై కేసు నమోదు చేయాలని బళ్లారి జిల్లా కలెక్టర్ ఎస్ఎస్. నకుల్ పోలీసుల‌ను కోరారు. దీనిపై విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఎమ్మెల్యే ప‌ర‌మేశ్వ‌ర్ ఓ షాకింగ్ విష‌యం తెలిసింది. అత‌డికి వైర‌స్ సోకింద‌ని తెలియ‌డంతో అత‌డు షాక‌య్యాడు. కొడుకు పెళ్లి వ‌ల‌న అత‌డికి పాజిటివ్ సోకింద‌నే వార్త క‌ర్నాట‌క‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ పెళ్లి విష‌య‌మై.. తాము అన్ని నియమ నిబంధనలు పాటించి పెళ్లి జరిపించామని, భౌతికదూరం పాటించామని, ఎవ‌రికీ వైరస్ రాదని ఎమ్మెల్యే పరమేశ్వర్ నాయక్ చెబుతున్న స‌మ‌యంలో అత‌డికి పాజిటివ్ వచ్చింద‌నే వార్త క‌ల‌క‌లం రేపింది.

కుమారుడి వివాహం అత‌డికే ప్రాణ‌సంక‌టంగా మార‌డం విశేషం. నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌కుండా చేస్తే ప‌రిస్థితి ఇలానే ఉంటుందని ప్ర‌జ‌ల‌తో పాటు ప్ర‌త్య‌ర్థులు పేర్కొంటున్నారు. ఇక‌నైనా ప్ర‌జ‌లంద‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని పోలీసులు.. వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Tags:    

Similar News