ఎవ‌డ్రా అన్న‌ది.. ర‌మేశ్ కుమార్ నిప్పు కాద‌ని!

Update: 2019-07-29 08:32 GMT
విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాలు చేయ‌టం అంత తేలికైన ప‌ని కాదు. ఇక‌.. పార్టీల‌కు అతీతంగా తాను కూర్చున్న కుర్చీకి త‌గ్గ‌ట్లు.. న్యాయంగా.. ధ‌ర్మంగా వ్య‌వ‌హ‌రిస్తూ క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకునేందుకు సైతం వెన‌క్కి త‌గ్గ‌ని నేర్పున్న నేత‌ల్ని ఈ మ‌ధ్య కాలంలో చూస్తున్న‌ది లేదు. స్పీక‌ర్ కుర్చీ అంటే.. అధికార‌ప‌క్ష అధినేత క‌నుసైగ‌కు త‌గ్గ‌ట్లుగా ప‌ని చేసేద‌న్న భావ‌న‌కు చెక్ చెప్ప‌ట‌మే కాదు.. స్పీక‌ర్ త‌లుచుకుంటే సీన్ ఎలా మారుతుంద‌న్న విష‌యాన్ని చేత‌ల్లో చేసి చూపించిన ఘ‌న‌త క‌ర్ణాట‌క స్పీక‌ర్ ర‌మేశ్ కుమార్ దిగా చెప్పాలి.

క‌ర్ణాట‌క రాష్ట్రంలో రాజ‌కీయ సంక్షోభం గ‌డిచిన కొన్ని వారాలుగా ఎడ‌తెగ‌ని రీతిలోసాగింది. కుమార‌స్వామి ప్ర‌భుత్వానికి దెబ్బేస్తూ..  కూట‌మి నేత‌లు ప‌లువురు జంప్ కావ‌టం.. వారిపై చ‌ర్య‌ల‌కు డిమాండ్లు ఒక‌ప‌క్క‌.. మ‌రోవైపు కొత్త త‌ర‌హా ఒత్తిళ్ల మ‌ధ్య న‌లిగిపోయిన ర‌మేశ్ క‌మార్.. స్పీక‌ర్ కుర్చీకి న్యాయం చేస్తూ.. ఏం చేయాలో దాన్ని క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో చేసేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

య‌డ్డి ప్ర‌భుత్వం బ‌ల‌ప‌రీక్ష‌ను ఎదుర్కోవ‌టానికి ఒక రోజు ముందు 17 మంది ఎమ్మెల్యేల మీద అన‌ర్హ‌త వేటు వేసి సంచ‌ల‌నం సృష్టించిన ఆయ‌న‌.. ఈ రోజు జ‌రిగి బ‌ల‌ప‌రీక్ష‌లో పాస్ కావ‌టానికి వీలుగా ఆయ‌న నిర్ణ‌యం ఉంద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయితే.. త‌న ముందుకు వ‌చ్చిన అంశాల‌పై న్యాయ‌సూత్రాల‌కు అనుగుణంగా తాను చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లుగా ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. బ‌ల‌ప‌రీక్ష పూర్తి అయిన వెంట‌నే.. స్పీక‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేసి మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చేశారు. బ‌ల‌ప‌రీక్ష‌లో బీజేపీ గెలిచిన నేప‌థ్యంలో తాను కాంగ్రెస్ త‌ర‌ఫున ప్ర‌తిపాదించిన స్పీక‌ర్ కావ‌టంతో ఆయ‌నీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న రాజ‌కీయాల‌కు భిన్నంగా ఏం చేసినా రూల్ ప్ర‌కార‌మే చేస్తాన‌ని చెప్ప‌టం.. అందుకు త‌గ్గ‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌టం ర‌మేశ్ కుమార్ లాంటి వారికే సాధ్య‌మని చెప్పక‌త‌ప్ప‌దు. త‌న తాజా నిర్ణ‌యంతో తానెంత నిప్పో ర‌మేశ్ చెప్ప‌క‌నే చెప్పేశార‌ని చెప్పాలి.
Tags:    

Similar News