నెలాఖరు దాకా కర్ణాటక షట్ డౌన్... జనానికి రెండు నెలల రేషన్ ఫ్రీ

Update: 2020-03-22 13:29 GMT
కోవిడ్- 19 వైరస్ ను కట్టడి చేసే క్రమంలో విశ్వవ్యాప్తంగా లాక్ డౌన్ లు, షట్ డౌన్ ను మారుమోగుతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ ప్రభావంతో చాలా దేశాలు షట్ డౌన్ ను ప్రకటించగా... తాజాగా ఈ వైరస్ ప్రభావం శరవేగంగా విస్తరిస్తున్న భారత్ లోనూ ఈ తరహా షట్ డౌన్ లు, లాక్ డౌన్ లు పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగా దక్షిణ భారత దేశంలోని కీలక రాష్ట్రం కర్ణాటక కూడా షట్ డౌన్ ను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆదివారం కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలో షట్ డౌన్ ను అమలు చేయనున్నట్లుగా ప్రకటించిన ఆయన...  కరోనా విస్తరణను అరికట్టేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలంతా మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.

మార్చి 31 వరకు కర్ణాటకలో షట్ డౌన్ ను అమలు చేయనున్నట్లుగా ప్రకటించిన యడియూరప్ప... రాష్ట్ర ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా రెండు నెలల రేషన్ ను ఉచితంగా అందించనున్నట్లుగా ప్రకటించారు. అంతే కాకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా నిత్యావసర సరుకుల పంపిణీకి చర్యలు తీసుకోనున్నట్లుగా కూడా ఆయన ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు తమ ప్రయాణాలను ఓ 15 రోజుల పాటు వాయిదా వేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించిన యడియూరప్ప... తదుపరి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. అయితే సోమవారం నుంచి మొదలు కానున్న ప్రీ యూనివర్సిటీ పరీక్షలను మాత్రం యథాతథంగా నిర్వహిస్తామని తెలిపారు.

ఇక కరోనాను కట్టడి చేసే క్రమంలో బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో ఏకంగా 1,700 పడకలను కరోనా అనుమానితుల కోసం సిద్ధం చేశామని యడియూరప్ప ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లో కరోనా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని కూడా ఆయన తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి అనుమతుల మేరకు ప్రైవేటు, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ల్యాబ్ ను ఏర్పాటు చేసి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మొత్తంగా రాష్ట్రాన్ని ఈ నెలాఖరు దాకా షట్ డౌన్ చేస్తున్నట్టుగా యడియూరప్ప ప్రకటించారు. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని, షట్ డౌన్ కు విరుద్ధం గా ఎవరు యత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని యడియూరప్ప హెచ్చరికలు జారీ చేశారు.
Tags:    

Similar News