‘‘డిఫ్యూటీ సీఎం’’ దాడి గురించి మాట్లాడవే కర్నె

Update: 2016-02-05 05:12 GMT
తెలంగాణ అధికారపక్షంలో ఫైర్ బ్రాండ్లకు కొదవలేదు. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడటంలో వారికి వారే సాటి. తాజాగా జరిగిన గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్.. బీజేపీలకు చెందిన ముఖ్యనేతలు మొదలుకొని అభ్యర్థుల వరకు దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారంతా కలిసి హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలంటూ గవర్నర్ నరసింహన్ ను కోరారు.

దీనిపై టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అన్నీ పార్టీలు కలిసి అఖిలపక్షం పేరుతో దొంగలబండి ఎక్కి మిలాఖత్ అయ్యాయని ఆయన మండిపడ్డారు. సెక్షన్ 8ను హైదరాబాద్ లో ఎలా అమలు చేస్తారని.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీసేందుకే విపక్షాలు కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు.

ఇన్ని మాటలు చెబుతున్న కర్నె.. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీ ఇంటిపై దాడి చేయటం.. ఆయన్ను పక్కకు తోసేయటం.. ఆయన కుమారుడిపై దాడి చేయటం లాంటి విషయాలతో పాటు.. సాక్ష్యాత్తు డిఫ్యూటీ సీఎం ఇంటి మీద దాడి జరుగుతుంటే.. అక్కడే విధుల్లో ఉన్న 20 మంది భద్రతాసిబ్బంది ఎందుకు పారిపోయారు? అయినా.. మిత్రపక్షంగా ఉన్నమజ్లిస్ కు చెందిన ఎమ్మెల్యే తమ డిప్యూటీ సీఎం ఇంటి మీద ఎందుకు దాడి చేశారన్న విషయాల మీద మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవటం గమనార్హం. విపక్షాల మీద విరుచుకుపడేందుకు అంత జోరును ప్రదర్శించిన కర్నె.. తమ పార్టీ ముఖ్యనేతపై జరిగిన దాడి గురించి ఎందుకు మాట్లాడరు..?
Tags:    

Similar News