మంత్రి కుమారుడికి బెంజ్ కారు.. అసలు నిజం ఇదే

Update: 2020-09-19 10:50 GMT
ఏపీ మంత్రి జయరాం కుమారుడికి బెంజ్ కారు గిఫ్ట్ గా వచ్చిందని.. ఈఎస్ఐ స్కాంలో ఏ14గా ఉన్న వ్యక్తి నుంచి ఇది అందిందని ఇటీవల ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్న తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో కేంద్రబిందువైన ఈఎస్ఐ స్కాంలో ఏ14గా ఉన్న కార్తీక్ తాజాగా స్పందించారు.

బెంజ్ కారు తాను మంత్రి కుమారుడు ఈశ్వర్ కు ఇచ్చినట్టుగా చూపిస్తున్న ఫొటోపై కార్తీక్ మాట్లాడారు. బెంజ్ కారు తాను ఎవరికీ బహుమతిగా ఇవ్వలేదన్నారు. తనకు మంత్రి కుమారుడు ఈశ్వర్ స్నేహితుడని.. స్నేహంలో భాగంగా మాత్రమే కొత్త కారును ఈశ్వర్ నుంచి తాను తీసుకున్నానని తెలిపారు.

గత ఏడాది డిసెంబర్ లో తాను బెంజ్ కారును కొన్నానని.. తనపై ఈఎస్ఐ స్కాం కేసు 2020 ఏప్రిల్ లో నమోదైందన్నారు. తనను జులైలో ఏసీబీ అరెస్ట్ చేసిందని.. ఈఎంఐ చెల్లించకపోవడంతో కారును సీజ్ చేశారని కార్తీక్ తెలిపారు. ప్రస్తుతం ఆ కారు హైదరాబాద్ లోని ఫైనాన్స్ కంపెనీ వారి ఆధీనంలో ఉందన్నారు.మంత్రికి కారు బహుమతిగా ఇస్తే ఆ కారు అక్కడ ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.

బెంజి కారును తాను మంత్రి కొడుకుకు గిఫ్ట్ ఇచ్చాను అనే వార్తలు అసత్య ఆరోపణలు అని నిజం కాదని.. తనకు మంత్రి కొడుకు స్నేహితుడు అని కార్తీక్ స్పష్టం చేశారు.

కాగా ఇప్పటికే ఈ కారు వివాదంలో ఏపీ మంత్రి జయరాం స్పందించారు. తనకు ఆ కారుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన కుమారుడి పేరున కారు ఉంటే తాను రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.
Tags:    

Similar News