బాబును కాపీ కొట్ట‌డంలో ఆయ‌న ఫెయిల‌య్యాడు

Update: 2016-05-20 15:25 GMT
పోల్ మేనేజ్‌ మెంట్‌ లో చేయి తిరిగిన నాయ‌కుడు అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడును అనుక‌రించ‌డంలో డీఎంకే ర‌థ‌సార‌థి క‌రుణానిధి విఫ‌ల‌మ‌య్యారు. రెండేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్‌ లో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ జ‌రిగేందుకు దాదాపు ప‌క్షం రోజుల ముందు వ‌ర‌కు వైసీపీ గాలి వీస్తుంద‌నే వార్త‌లు పెద్ద ఎత్తున వెలువ‌డిన స‌మ‌యంలో రంగంలోకి దిగిన బాబు అన్ని అస్ర్తాల‌ను ఉప‌యోగించి తెలుగుదేశం పార్టీని విజ‌య‌తీరాల‌కు చేర్చారు. ఈ గెలుపులో అత్యంత కీల‌కంగా రైతు రుణమాఫీ పనిచేసింది. దీంతో కరుణానిధి కూడా ఈ మంత్రాన్ని జపించారు. అయితే ఫ‌లితం మాత్రం నిష్ర్ప‌యోజ‌నంగా మారింది.

తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌రుణానిధి త‌మ‌ కొత్త హామీగా రైతు రుణ‌మాఫీని ప్ర‌క‌టించారు. అంతేకాకుండా మహిళా రుణాలు - విద్యారుణాలను కూడా మాఫీ చేస్తానని చెప్పారు. అయినప్పటికీ అవేవీ మంచి ఫలితాన్ని తీసుకురాలేకపోయాయి. 2014 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ మద్యనిషేధంపై నిరసనలు ఎగసిపడ్డాయి. ప్రతిపక్షాలు సైతం జెండాలు పట్టుకోవడంతో రాష్ట్రంలో ఇదే పెద్ద విప్లవంగానూ మారింది. మద్యనిషేధ హామీకి ప్రజాదరణ ఎక్కువగా ఉందని భావించిన డీఎంకే తాము ప్రభుత్వంలోకి వస్తే తొలి సంతకం మద్యనిషేధంపైనే అని కరుణానిధి చెప్పారు. ఈ అస్త్రం మహిళా ఓటర్లపై ప్రభావం చూపుతుందని డీఎంకే భావించింది. మేనిఫెస్టోలో మార్పు దిశగా పలు అంశాలను ప్రస్తావించింది. కానీ త‌మిళుల మ‌న‌సును నెగ్గే ఉచితాల జోలికి వెళ్లలేదు.

త‌మిళ‌నాడు అంటేనే ఉచిత స్కీమ్‌ ల‌తో ఎంజాయ్ చేసే ప్ర‌జానికానికి పెట్టింది పేరు. ఉచితాలను మనసులో పెట్టుకున్న రాష్ట్రప్రజలు డీఎంకే మేనిఫెస్టోను ఎన్నిసార్లు తిరగేసినా.. అలాంటివి ఏవీ క‌నిపించ‌లేదు. మ‌రోవైపు పాలక అన్నాడీఎంకే మహిళలకు ద్విచక్రవాహనాలకు 50 శాతం సబ్సిడీ - 100 యూనిట్ల వరకు విద్యుత్‌ ఛార్జీలు ఉచితం వంటి కొత్త హామీల‌తో పాటు అంత‌క‌ముందు జ‌నాద‌ర‌ణ పొందిన అమ్మ ప‌థ‌కాలు ఎలాగూ ఉన్నాయి. దీంతో డీఎంకే విజయానికి ఇవ‌న్నీ బ్రేకులు వేశాయ‌ని చెప్తున్నారు. మొత్తానికి ఒక‌టే రుణ‌మాఫీ మంత్రం ఒడ్డుకు చేరుస్తుంద‌నుకున్న క‌రుణానిధి అంచ‌నా వైఫ‌ల్యం అయింద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు అంటున్నాయి.
Tags:    

Similar News