జయ అంత ఆరోగ్యంగా ఉన్నారా?

Update: 2016-10-12 12:26 GMT
సుమారు 20 రోజులుగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదేశాల మేరకు ఆర్ధికమంత్రి పన్నీర్‌ సెల్వమ్‌ కు శాఖల బదలాయింపు జరిగిందని గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌ రావు చెప్పడం, తమిళనాడు రాజ్ భవన్ మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేయడం తెలిసిందే. అయితే ఈ విషయాలపై తాజాగా డిఎంకే అధినేత కరుణానిధి స్పందించారు. ఇప్పటికే జయలలిత అనారోగ్యంపై వినిపిస్తున్న ఊహగానాలకు ముగింపు పలకాలని - ప్రజలకు సరైన సమాచారం అందించాలని - ఆమె ఫోటోలు విడుదల చేయాలని గతంలో డిమాండ్ చేసిన ఆయన... అమ్మ అనుమతితోనే శాఖల బదాలాయింపు అనే అంశంపై అనుమానాలు వ్యక్తం చేశారు.

అనారోగ్యంతో ఉందని - కృత్రిమ శ్వాస అందిస్తున్నారని కథనాలు వస్తున్న తరుణంలో జయలలిత శాఖల బదలాయింపుపై స్పందించడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శాఖల బదలాయింపు జరగాలంటూ జయలలిత ఫైల్‌పైన సంతకం చేశారా? ఫైల్స్ పైన సంతకం చేసేంత ఆరోగ్యంగా ఆమె ఉన్నారా? అని కరుణానిధి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆమె అంత ఆరోగ్యంగా ఉండి ఉంటే... వెంకయ్యనాయుడు - రాహుల్ గాంధీ - స్టాలిన్ తదితర నేతలంతా ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఆమెను నేరుగా కలిసి మాట్లాడేందుకు ఎందుకు అనుమతించలేదు అని ప్రశ్నిస్తూ.. ఆ ఫైల్ పై ఆమె ఎలా సంతకం చేశారో, ఎలా అనుమతిచ్చారో తెలియడం లేదని అనుమానం వ్యక్తం చేశారు! ఇదేసమయంలో గత 19 రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఇంకా ఎంతకాలం చికిత్స పొందాల్సి వస్తుందో ఎవరికీ తెలియడం లేదని, గవర్నర్ రాజ్యాంగంలోని అన్ని కోణాలను పరిశీలించాకే శాఖల బదలాయింపు నిర్ణయం తీసుకున్నారో లేదో అర్ధంకావడం లేదని అని కరుణానిధి అన్నారు! అయితే కరుణానిధి తనయుడు స్టాలిన్ మాత్రం శాఖల బదలాయింపు నిర్ణయాన్ని స్వాగతించారు.

కాగా రాజ్యాంగంలోని 166వ ఆర్టికల్ క్లాజ్ నెంబర్ -3 ను అనుసరిస్తూ సీఎం శాఖలను ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వంకి అప్పగించడంతో పాటు కేబినేట్ సమావేశాలను నిర్వహించే బాధ్యతలను కూడా ఆయనకే అప్పగిస్తున్నట్లు రాజ్ భవన్ ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News