జ‌య ప‌క్క‌నే క‌రుణ‌...ఇద్ద‌రు దిగ్గ‌జాల ప్ర‌త్యేక‌త‌

Update: 2018-08-08 11:38 GMT
త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో కీల‌క ఘ‌ట్టం ముగిసింది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా తమిళ రాజకీయాల్లో బద్ధ శత్రువులుగా ఉన్న అన్నాడీఎంకే ర‌థ‌సార‌థి జ‌య‌ల‌లిత‌ - డీఎంకే నాయ‌కుడు క‌రుణానిధి త‌మ తుది శ్వాస విష‌యంలో ఓ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్నారు. అంత‌టి బ‌ద్ద శతృత్వం ఇద్దరి మధ్య ఉన్న‌ప్ప‌టికీ ఇప్పుడు ఆ జయలలిత సమాధి పక్కనే కరుణానిధి కూడా శాశ్వతంగా విశ్రాంతి తీసుకోబోతున్నారు.మరీనా బీచ్‌ లో కరుణానిధి ఖననానికి తమిళనాడు ప్రభుత్వం అంగీకరించని విషయం తెలిసిందే. దీంతో డీఎంకే మద్రాస్ హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుంది.

కాగా, మెరీనాలో స్థల కేటాయింపుపై హైకోర్టులో వాడీవేడీ వాదనలు జరిగాయి. కోర్టులో వ్యాజ్యాలు ఉపసంహరించుకున్న తర్వాత మీకున్న అభ్యంతరమేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ముందు నిబంధనలన్నారు.. తర్వాత కోర్టులో వ్యాజ్యాలంటున్నారని ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలను సాకుగా చూపి మెరీనాలో స్థల కేటాయింపు కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో జానకీ రామచంద్రన్ అంత్యక్రియలకు డీఎంకే ప్రభుత్వం అనుమతివ్వలేదని ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది గుర్తుచేశారు. ప్రభుత్వ వాదనను డీఎంకే న్యాయవాది తప్పుపట్టారు. ప్రోటోకాల్ విషయంలో సిట్టింగ్ - మాజీ సీఎంలు ఒకటి కాదని సర్కార్ వివరించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ వాదనను డీఎంకే న్యాయవాది తప్పుపట్టారు. ద్రవిడ నేతల సమాధుల పక్కనే అంత్యక్రియలు నిర్వహించాలని డీఎంకే కోరింది. ద్రవిడ ఉద్యమ మహానేత పెరియార్ అంత్యక్రియలు మెరీనాలో నిర్వహించలేదని ప్రభుత్వం గుర్తుచేసింది. అయితే ప్రజల సెంటిమెంట్ దెబ్బతింటుందని డీఎంకే వాదించింది. సెంటిమెంట్ల ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేమని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. మెరీనాలో స్మారకాల నిర్మాణానికి చెన్నై కార్పొరేషన్ అనుమతులు ఇచ్చిందని డీఎంకే పేర్కొంది. రాత్రికి రాత్రే మేనేజ్‌ చేసి ఐదు కేసులను విత్‌ డ్రా చేయించారని ప్రభుత్వ న్యాయవాది సంచలన వ్యాఖ్యలు చేశారు. మేనేజ్‌ చేశారన్న దానిపై డీఎంకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరువురి వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు మెరీనా-అన్నా స్కేర్ వద్దే కరుణానిధి అంత్యక్రియలకు అనుమతినిచ్చింది. సాయంత్రం మెరీనాలో కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

తమిళ రాజకీయాల్లో కరుణానిధి - జయలలిత మధ్య దశాబ్దాల పాటు వైరం కొనసాగింది. ఇప్పుడు వైరిపక్షం అన్నాడీఎంకేనే అధికారంలో ఉండటం - మెరీనా బీచ్‌ లో ఖననానికి అనుమతి ఇవ్వకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. గాంధీ మండపం దగ్గర ప్రత్యేకంగా రెండెకరాల స్థలం ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించినా డీఎంకే అంగీకరించలేదు. ఎట్ట‌కేల‌కు కోర్టు ఆదేశాల‌తో డీఎంకేకు చెందిన ఆరెస్ భారతి ఇచ్చిన ప్లాన్ ప్రకారమే ఖననం చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. డీఎంకే పార్టీ దగ్గర ఉన్న ప్లాన్ ప్రకారం కరుణానిధిని ఖననం చేసే చోటు ఆయన గురువు అన్నాదురై - జయలలిత సమాధుల మధ్య ఉంది.
Tags:    

Similar News