అమ్మే కాదు.. ఆయన కూడా ఆసుపత్రిలోనే..

Update: 2016-12-01 05:21 GMT
ఏ రాష్ట్రంలో చోటు చేసుకోని చిత్రమైన పరిస్థితి తమిళనాడులో చోటు చేసుకుంది. గత కొద్ది నెలలుగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర అస్వస్థతతో.. చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తీవ్రమైన జ్వరం..డీహైడ్రేషన్ తో ఆసుపత్రిలో చేర్చినట్లు చెప్పినా.. ఆమె అనారోగ్యం చాలా తీవ్రమైనదన్న విషయం తర్వాత అర్థమైంది. నెలలు గడుస్తున్నా.. ఇప్పటికి ఆమె ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ మధ్యనే ఆమె నడవటం మొదలు పెట్టారని.. మరికొన్ని రోజులు ఆసుపత్రిలో ఉంటారంటూ వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత.. డీఎంకే అధినేత.. తమిళ రాజకీయాల్లో పెద్దాయనగా అభివర్ణించే కరుణానిధి అస్వస్థతకు గురయ్యారు. ఈ మధ్యన ఆయన తరచూ అనారోగ్యానికి గురి అవుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవటంతో గురువారం తెల్లవారు జామున ఆయన్ను కావేరి ఆసుపత్రికి తరలించారు. అలర్జీ సంబంధిత సమస్యలతో ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు.

తాజాగా కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు ఒక బులిటెన్ ను విడుదల చేశాయి. ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆయనకు చికిత్స చేస్తున్నట్లుగా పేర్కొంది. న్యూట్రిషన్.. డీహైడ్రేషన్ కు సంబంధించిన చికిత్సలు చేస్తున్నట్లుగా చెప్పిన ఆసుపత్రి వర్గాలు.. కొన్ని రోజుల పాటు ఆయన్ను ఆసుపత్రిలోనే ఉంచాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని చెప్పాయి. అధికారపక్ష అధినేత.. ప్రధాన ప్రతిపక్ష అధినేతలు ఇద్దరూ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండటం అరుదైన విషయంగా చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News