గుర్తుండిపోయే దాడి చేస్తామంటున్న ఉగ్రవాది!

Update: 2016-11-08 04:42 GMT
భారతదేశంలో భారీ విధ్వంసానికి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తాయిబా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో పీఓకే లో భారత సైన్యం జరిపిన సర్జికల్‌ స్ట్రైక్ కి ప్రతీకారం తీర్చుకొనేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా సరిహద్దులోని భారత సైనిక శిబిరాలపై సర్జికల్‌ దాడులకు పాల్పడటంతోపాటు భారతదేశంలోని ప్రధాన నగరాల్లో భారీ విధ్వంసానికి సిద్ధమవుతోంది. ఈమేరకు భారత నిఘా సంస్థలు పక్కా సమాచారం సేకరించాయట. ఇదే క్రమంలో భారత సైన్యంపై త్వరలో సర్జికల్‌ దాడులకు పాల్పడతామని జమ్మత-ఉద్‌-దవా చీఫ్‌ - లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ స్వయంగా ప్రకటించాడు. భారతకు సుదీర్ఘకాలం గుర్తుండిపోయేలా సర్జికల్‌ దాడులుచేస్తామని హెచ్చరించాడు.

అయితే ఈ విషయంలో భారత్ లోకి ప్రవేశించడానికి ఉగ్రవాదులు కొత్తమార్గాలు వెతుక్కుంటున్నారట. భూభాగపు సరిహద్దుల్లో కనిపిస్తే తాట తీస్తున్న భారత సైన్యానికి భయపడిన పాక్ అనధికారిక సైన్యం... మరో మార్గం మీదుగా భారత్ లోకి ప్రవేశించి భారీ విధ్వంసానికి పాల్పడాలని కుట్రపన్నుతున్నారట. దీనికోసం సరిహద్దుల్లో ఉన్న నదులు, కాలువలను ఉపయోగించుకొని తన ఉగ్రమూకను దేశంలోకి పంపాలని లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. భారత్ లో భారీ మారణహోమం లక్ష్యంగా ఎనిమిది నుంచి తొమ్మిది మంది ఈ ఆపరేషన్‌ లో పాల్గొనబోతున్నారని, వారికి లష్కరే కమాండర్‌ అబు ఇర్ఫాన్‌ తందేవాలాను ఇన్‌ చార్జిగా సయీద్‌ నియమించినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి!

ఎలాగూ ఈ ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు పాక్‌ సైన్యం లోపాయికారి సహకారం అందిస్తుందనేది జగమెరిగిన సత్యమే. ఈ నేపథ్యంలో సరిహద్దుల మీదుగా ఉన్న నదులు, కాలువ మార్గాల వద్ద భారత సైన్యం నిఘాను మరింత పెంచింది. అంతేకాకుండా అనుమానిత చొరబాటు మార్గాల వద్ద బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్ ఎఫ్‌) ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి పహారా కాస్తున్నది. కాగా, భారత్‌ - పాక్‌ సరిహద్దుల్లో 3 నదులు, 11 కాలువలు ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News