ఏపీ డీజీపీ 'కసిరెడ్డి' బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Update: 2022-02-15 13:30 GMT
అనూహ్యంగా తీసుకున్న నిర్ణయం ఒక్క ఏపీ ప్రజల్ని మాత్రమే కాదు తెలంగాణ ప్రజల్ని కూడా ఆశ్చర్యపరిచింది. ఆ మాటకు వస్తే అవాక్కు అయ్యేలా చేసిందని చెప్పాలి.

జగన్ ప్రభుత్వానికి అత్యంత విధేయుడిగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాల చేత డైలీ బేసిస్ లో విమర్శలు.. ఆరోపణలు మాత్రమే  కాదు ఇటీవల కాలంలో హెచ్చరికలు కూడా అందుకున్న ఏపీ పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు వేయటమే కాదు..ఆయనకు ఎక్కడా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి రిపోర్టు చేయాలని పేర్కొనటం చాలామందికి నోట మాట రాకుండా చేసింది.

ఇదిలా ఉంటే .. గౌతమ్ సవాంగ్ స్థానంలో డీజీపీగా బాధ్యతల్ని చేపట్టనున్నారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. ప్రస్తుతం ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు.

ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన నిరసన ర్యాలీ అనూహ్యంగా విజయవంతం కావటం.. చరిత్రలో నిలిచిపోయేలా జరిగిన ఈ ఇష్యూలో.. మొత్తంగా నిఘా వైఫల్యంగా అందరూ అభిప్రాయపడుతున్న వేళ.. దానికి చీఫ్ గా వ్యవహరిస్తున్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి రాష్ట్ర డీజీపీగా అవకాశం రావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. సీఎం నిర్ణయాల వెనుక ఉన్న అసలు కారణం ఏమిటన్నది అంతుబట్టనిదిగా మారింది.

ఇక.. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి విషయానికి వస్తే.. ఆయన స్వస్థలం కడప జిల్లా రాజుపాళెం మండలం పర్లపాడు. కొన్నేళ్ల క్రితం ఆయన కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడింది.

1992 బ్యాచ్ కు చెందిన రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్  అధికారిగా పలు చోట్ల పని చేశారు. ఒకదశలో ఔషధ నియంత్రణ విభాగం అధికారిగా సేవలు అందించారు. గతంలో విజయవాడ సీపీగా పని చేశారు. విశాఖ పోలీసు కమిషనర్ గా పని చేసిన అనుభవం ఉన్న ఆయన హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీగా వ్యవహరించారు కూడా.

విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్సు మెంట్ డీజీగా పని చేసిన రాజేంద్రనాథ్ రెడ్డి.. పలు కీలక కేసుల్లో కీలక భూమిక పోషించిన పేరుంది. సర్వీసులో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆయన.. ప్రెసిడెంట్ మెడల్ కూడా సాధించారు.

ప్రస్తుతం నిఘా విభాగం చీఫ్ గా ఉన్న ఆయన.. ఇప్పుడు ఏకంగా ఏపీ పోలీస్ బాస్ గా ఎంపికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ.. విభజన తర్వాత.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఒక రాష్ట్ర డీజీపీ ఒకే జిల్లా వారు కావటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఇదో ఆసక్తికర కాంబినేషన్ మాత్రమే కాదు.. చాలా అరుదుగా అభిప్రాయ పడుతున్నారు.
Tags:    

Similar News