కాంగ్రెస్ లో క్రమశిక్షణ అలా ఉంది మరి..

Update: 2016-12-16 06:44 GMT
కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ నవ్వులపాలైంది.. ఏపీ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పైనే క్రమశిక్షణారాహిత్యం ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు... ఏకంగా ఆయనపైనే వేటువేశారు. పార్టీ నాయకులు ఎవరైనా కట్టు తప్పితే హెచ్చరికలు - నోటీసులు - సస్పెన్షన్, వేటు.. తప్పు స్థాయిని బట్టి రకరకాలుగా క్రమశిక్షణ చర్యలను సిఫారసు చేసే ఈ కమిటీకి కాసు కృష్ణారెడ్డి ఛైర్మన్ గా ఉన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు పార్టీ మారుతుండడంతో ఆయన పదవికి ఎసరొచ్చింది.
    
కాసు కృష్ణారెడ్డిని క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ పదవి నుంచి తొలగిస్తూ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కాసు కృష్ణారెడ్డి కుమారుడు కాసు మహేష్‌ రెడ్డి గురువారం వైసీపీలో చేరుతున్న నేపథ్యంలో పీసీసీ ఈ చర్యలు తీసుకుందని చెబుతున్నారు. తన కుమారుడు వైసీపీలో చేరినా తాను మాత్రం కాంగ్రెస్‌ లోనే కొనసాగుతానని ఇటీవల కృష్ణారెడ్డి ప్రకటించినా చర్యలు తప్పలేదు.
    
కాగా ఈ రోజు నరసరావుపేటలో కాంగ్రెస్ శ్రేణులు మొత్తం మహేష్ రెడ్డితో పాటు వైసీపీలో చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ గా కృష్ణారెడ్డిని కొనసాగించడం మంచిది కాదని కాంగ్రెస్ భావించింది. కాసు కృష్ణారెడ్డి రెండుసార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పలు మంత్రి పదవులు నిర్వహించారు. కాసు కుమారుడి చేరికతో గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయినట్టేనని చెబుతున్నారు.  కృష్ణారెడ్డిపై వేటు వేయడంతో ఆయన కూడా కుమారుడితో పాటే కాస్త అటుఇటుగా వైసీపీలో చేరుతారని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News