క‌త్తి సెటైర్‌!... పీకే అజ్ఞాన‌వాసేన‌ట‌!

Update: 2018-03-28 11:46 GMT
టాలీవుడ్ లో ప‌వర్ స్టార్‌ గా జ‌న నీరాజ‌నాలు అందుకుంటున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌... గ‌డ‌చిన ఎన్నిక‌ల‌కు ముందే జ‌న‌సేన పేరిట రాజ‌కీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష బ‌రికి వెనుకాడిన ప‌వ‌న్‌... టీడీపీ, బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తుగా నిలిచి ఏపీలో టీడీపీకి అధికారం ద‌క్క‌డంలో కీల‌కంగానే వ్య‌వ‌హ‌రించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఆ త‌ర్వాత కూడా టీడీపీతోనే మైత్రిని కొన‌సాగించిన ప‌వ‌న్‌... మొన్న‌టికి మొన్న నిర్వ‌హించిన పార్టీ ఆవిర్భావ వేదికపై టీడీపీతో తెగ‌దెంపులు చేసుకుంటున్న‌ట్లుగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అంతటితో ఆగ‌ని ప‌వ‌న్‌..టీడీపీ వైఖ‌రి, చంద్ర‌బాబు ఫ్యామిలీపైనా నిప్పులు చెరిగారు.

ఇదంతా బాగానే ఉన్నా... సినీ క్రిటిక్‌గా జ‌నాల‌కు బాగానే ప‌రిచ‌య‌మైన క‌త్తి మ‌హేశ్‌... మొన్న‌టిదాకా ప‌వ‌న్ కల్యాణ్‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ఆటాడుకున్న విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే. ట్విట్ట‌ర్ లో త‌న‌ను క‌త్తి మ‌హేశ్ ఎన్ని మాట‌ల‌న్నా కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించిన పాపాన పోలేదు. అంతేకాకుండా ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా రంగంలోకి దిగిన ప‌లువురిని కూడా క‌త్తి మ‌హేశ్ ఓ ఆటాడుకున్నాడు. ఈ క్ర‌మంలో క‌త్తి మ‌హేశ్‌ - ప‌వ‌న్ ఫ్యాన్స్ మ‌ధ్య మాట‌ల తూటాలు పేలాయి. ఇరు వ‌ర్గాల మ‌ధ్య బూతులు కూడా దొర్లాయి. అయితే కాల‌క్ర‌మంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య రాజీ కుదిరిన నేప‌థ్యంలో ప‌వ‌న్ ను క‌త్తి మ‌హేశ్ ఇటీవ‌లి కాలంలో ఒక్క మాట కూడా అన‌లేదనే చెప్పాలి. మొత్తంగా ఓ నెల‌కు పైగానే ప‌వ‌న్ పై క‌త్తి మ‌హేశ్ సింగిల్ కామెంట్ కూడా చేయ‌లేద‌నే చెప్పాలి.

అయితే ఉన్న‌ట్లుండి కాసేప‌టి క్రితం ట్విట్ట‌ర్‌ లోనే ఎంట్రీ ఇచ్చిన క‌త్తి మ‌హేశ్‌.... మ‌రోమారు ప‌వ‌న్‌ ను ఏకి పారేశారు. ప‌వ‌న్‌కు ఏమాత్రం జ్ఞానం లేద‌ని - ప‌వ‌న్ ఓ అజ్ఞాని అని కూడా క‌త్తి మ‌హేశ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఏపీకి ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం తారా స్థాయిలో కొన‌సాగుతోంది. అయితే మొన్న‌టిదాకా ప్ర‌త్యేక హోదాపై త‌న‌దైన శైలిలో నిర‌స‌న గ‌ళం విప్పిన ప‌వ‌న్... ఇప్పుడు మాత్రం నోరు మెదిపేందుకు కూడా సిద్ధంగా లేర‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇదే అంశాన్నే ఆధారం చేసుకుని క‌త్తి మ‌హేశ్... ప‌వ‌న్‌ పై విరుచుకుప‌డిన‌ట్లుగా తెలుస్తోంది.

అయినా ప‌వ‌న్‌పై క‌త్తి మ‌హేశ్ ఏమ‌ని కామెంట్ చేశార‌న్న విష‌యానికి వ‌స్తే... *బాబు పవన్ కల్యాణ్! రాజ్యంగ సంక్షోభం అనగానేమి? 10 మార్కుల ప్రశ్న. సమాధానం చెప్పుడు. చంద్రబాబు నాయుడు పార్లమెంటు ముందు నిరసన చేసిన ఎడల - ఆ రాజ్యాంగ సంక్షోభం ఎలా ఏర్పడును? ఉప ప్రశ్న. 5 మార్కులు పూరింపుడు. నోరు తెరిస్తే అజ్ఞానం. అజ్ఞానవాసి సుఖీభవ!* అంటూ ప‌వ‌న్‌ను ఆయ‌న త‌న‌దైన శైలిలో ఏకి పారేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ శిబిరం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News