విశాఖపట్టణంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు జనసేన పార్టీ అధ్యక్షుడు - సినీ నటుడు పవన్ కల్యాణ్ మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ మూడు రోజుల పాటు వైజాగ్ లో పర్యటించనున్నారు. పవన్ అభిమానులకు - ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ కు మధ్య కొద్ది రోజులుగా వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. పలు టీవీ షోలలో కూడా ఆ రెండు వర్గాల మధ్య వాడివేడి చర్చలు నడిచాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పై కత్తి మహేష్ మరోసారి విమర్శలు గుప్పించారు. పవన్ విశాఖ పర్యటన వల్ల ఆయనకు రెండు లాభాలున్నాయని మహేష్ అన్నారు. రాజకీయపరంగా - సినిమా పరంగా ఈ పర్యటన ఆయనకు పనికివస్తుందని వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మహేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజాసేవలో భాగంగానే పవన్ విశాఖలో పర్యటిస్తున్నారని చాలామంది అంటున్నారని - ఆ చాలామంది తనకు తెలియదని అన్నారు. పవన్ నటించిన ‘అజ్ఞాతవాసి’ సంక్రాంతికి విడుదల కాబోతోందని - దీంతో - ఒకే దెబ్బకు రెండు పిట్టలు (‘ఏక్ పంత్ దో కాజ్’) అన్న రీతిలో పవన్ విశాఖ పర్యటన సాగుతోందని మహేష్ అన్నారు. ఈ పర్యటన వల్ల ఏకకాలంలో రాజకీయపరంగా, సినిమా పరంగా ప్రమోషన్ జరిగిపోతుందన్నారు.ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టడం తప్పు కాదని, టైమ్ తక్కువున్నందున రెండింటినీ కవర్ చేయడానికి పవన్ మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇప్పటికైనా, పవన్ జనాల్లోకి వెళుతున్నారని, అంతకన్నా కావలసిందేముందని వ్యాఖ్యానించారు. తాజాగా, మహేష్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకు పవన్ అభిమానులు స్పందించలేదు.