కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరే ముహూర్తం ఖరారు.. టీఆర్‌ఎస్‌ వ్యూహం అదేనా ?

Update: 2021-07-17 08:30 GMT
తెలంగాణ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్‌ గా మారుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజీనామా తో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తప్పనిసరి అవుతుంది. దీంతో ఇప్పుడు హుజూరాబాద్ వైపు అందరి దృష్టి మళ్లింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఈటల చేతిలో ఓడిన పాడి కౌశిక్‌ రెడ్డి టీఆర్‌ ఎస్‌ లో చేరేందుకు రంగం సిద్ధం అయ్యింది. అయన టిఆర్ ఎస్ లో చేరే ముహూర్తం కూడా దాదాపుగా ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఈ నెల 21న కౌశిక్ రెడ్డి టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.

హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన తన అనుచరులు,మద్దతుదారులతో కలిసి ఆయన టిఆర్ ఎస్ పార్టీలో చేరనున్నారు. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. మొదటగా అయన ఈ నెల 16 నే పార్టీలో చేరబోతున్నారు అంటూ వార్తలు వచ్చినప్పటికీ అనుకోని కారణాలతో అది వాయిదా పడినట్టు తెలుస్తుంది. ఇక్కడ అందరి మదిలో మెదిలే మరో ప్రశ్న ఏమిటంటే కౌశిక్ రెడ్డి టీఆర్ ఎస్ లో చేరడం ఖరారైందని తెలుస్తున్నప్పటికీ... ఆ పార్టీ తరుపున హుజురాబాద్ టికెట్ దక్కుతుందా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. అలాగే , కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి బేషరతుగా పార్టీలో చేరుతున్నారా లేక హుజురాబాద్ టికెట్ హామీ మేరకే టిఆర్ ఎస్ కండువా కప్పుకోబోతున్నారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం టికెట్ ఖాయం అని హామీ వచ్చిన తర్వాతనే ఆయన టీఆర్ ఎస్ లో చేరుతున్నారనే ప్రచారం జరుగుతుంది.

గత కొద్ది రోజుల క్రితం వరకు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన కౌశిక్ రెడ్డి అనూహ్య పరిణామాలతో ఆ పార్టీని వీడిన విషయం తెలిసిందే. టీఆర్ ఎస్ టికెట్ నాకే ఖరారైంది... అంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో లీకవడంతో కాంగ్రెస్ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీలో కొనసాగుతూ ప్రత్యర్థి పార్టీ టికెట్ దక్కిందని ప్రచారం చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. షోకాజ్ నోటీసులపై వివరణ ఇవ్వకుండానే కౌశిక్ రెడ్డి పార్టీ నుంచి తప్పుకున్నారు. ఆ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌కి రూ.50 కోట్లు ముట్టజెప్పి రేవంత్ ఆ పదవి దక్కించుకున్నారని సంచలన ఆరోపణలు గుప్పించారు.

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రెండు,మూడు రోజుల్లోనే రాజకీయ భవిష్యత్‌పై ప్రకటన ఉంటుందని చెప్పినప్పటికీ... ఇప్పటివరకూ మళ్లీ ఆయన మీడియా ముందుకు రాలేదు. దీంతో కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్‌ కూడా దూరం పెడుతోందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఒకానొక దశలో కౌశిక్ రెడ్డి వైఎస్ షర్మిల సారథ్యంలోని వైఎస్సార్‌ టీపీ వైపు చూస్తున్నారన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ ఎట్టకేలకు ఆయన గులాబీ గూటికే చేరబోతున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇక ఇటీవల టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలంగాణ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎల్‌.రమణ సోమవారం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేతుల మీదుగా పార్టీ సభ్యత్వం తీసుకున్న విషయం తెలిసిందే.

అలాగే హుజూరాబాద్‌ నుంచి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన పెద్దిరెడ్డి బీజేపీ తరఫున ఈసారి పోటీ చేయాలని భావించారు. ఈటల బీజేపీలో చేరడంతో ఆ అవకాశం కోల్పోయిన ఆయన బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అప్పటి నుంచి అంటీ ముంటనట్టుగానే బీజేపీతో ఉన్న పెద్దిరెడ్డి త్వరలోనే టీఆర్‌ ఎస్‌ లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేసీఆర్‌తో గతంలో ఉన్న పరిచయాలు, తాజాగా సహచరుడు ఎల్‌.రమణ టీఆర్‌ ఎస్‌ లో చేరిన నేపథ్యంలో పెద్దిరెడ్డి కూడా కారెక్కడం ఖాయమైనట్లు తెలుస్తోంది. త్వరలో జరగబోయే హుజూరాబాద్‌ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డిని బరిలోకి దించి అటు కాంగ్రెస్ , ఇటు బీజేపీ కి చెక్ పెట్టె ప్రణాళికల్లో గులాబీ శ్రేణులు ఉన్నట్టు జోరుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. చూడాలి మరి హుజూరాబాద్‌ టికెట్ ఎవరికి దక్కుతుందో .. విజయం ఏ పార్టీని వరిస్తుందో.


Tags:    

Similar News