సారు బిడ్డ‌.. బాబు కొడుకు ఓడిపోయారే!

Update: 2019-05-23 11:51 GMT
రెండు తెలుగు రాష్ట్రాల చంద్రుళ్ల‌కు దిమ్మ తిరిగిపోయేలా షాకులు ఇచ్చారు తెలుగు ఓట‌ర్లు. వారే మాత్రం ఊహించ‌ని రీతిలో ఇచ్చిన తీర్పుకు వారేం మాట్లాడ‌లేని ప‌రిస్థితి. పార్టీ అధినేత‌లుగా తిరుగులేని అధికారం చేతిలో ఉన్న వేళ‌.. సొంత పిల్ల‌ల్ని గెలిపించుకోలేక‌పోవ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె క‌మ్ నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ క‌విత ప‌రాజ‌యం పాలు కాగా.. ఎమ్మెల్సీగా మంత్రి ప‌ద‌విని చేప‌ట్టిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు లోకేశ్ మంగ‌ళ‌గిరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగి ఓడిన వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఇద్ద‌రు చంద్రుళ్లు.. త‌మ పార్టీ అభ్య‌ర్థుల గెలుపు మీద భారీ ధీమాను ప్ర‌ద‌ర్శించిన వారే. వేడుక‌లు చేసుకోవ‌టానికి ఏర్పాట్లు చేయండ‌ని కేసీఆర్ పిలుపునిస్తే.. వంద‌కు వెయ్యి శాతం పార్టీ గెలుపు ఖాయ‌మంటూ విప‌రీత‌మైన ఆత్మ‌విశ్వాసాన్ని ప్ర‌ద‌ర్శించారు చంద్ర‌బాబు. అలాంటి ఇద్ద‌రు చంద్రుళ్ల‌కు తాజా ఎన్నిక‌ల ఫ‌లితాలు ఒక స్థాయిలో షాక్ ఇచ్చాయ‌ని చెప్పాలి.

ఫ‌లితాల ఓట‌మి ఒక ఎత్తు అయితే.. సొంత పిల్ల‌ల్ని గెలిపించుకోవ‌టంలో ఫెయిల్ అయిన తీరు చంద్రుళ్ల ఇద్ద‌రికి మ‌చ్చ‌గా మారుతుంద‌న‌టంలో సందేహం లేదు. అంత ప‌వ‌ర్ ఉండి.. తాను ఎవ‌రిని బ‌రిలోకి దించితే వారిని గెలిపించుకునే స‌త్తా ఉంద‌ని చెప్పుకునే కేసీఆర్.. ఇప్పుడు త‌న కుమార్తెను గెలిపించుకోలేని ప‌రిస్థితిలోకి వెళ్ల‌టం దేనికి నిద‌ర్శ‌నం అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి.

ఇక‌.. చంద్ర‌బాబు ప‌రిస్థితి మ‌రింత దారుణం. ఆయ‌న కుమారుడు.. త‌న రాజ‌కీయ వార‌సుడిగా భావించే లోకేశ్ తొలిసారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దింపి.. ఓట‌మి పాలు కావ‌టం బాబు జీర్ణించుకోలేని పరిస్థితి. భావి పార్టీ అధినేత‌.. త‌న తొలి ఎన్నిక‌ల్లోనే ప్ర‌జ‌లు తిర‌స్క‌రించ‌టం బాబును బాధించేదే. మొత్తంగా చూస్తే.. ఈసారి ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇద్ద‌రు చంద్రుళ్ల‌కు చేదు అనుభ‌వాన్ని మిగిల్చిన‌ట్లే.


Tags:    

Similar News