అంధకారం లో కవిత భవిష్యత్.. కేసీఆర్ ఏం చేస్తారు?

Update: 2020-01-27 04:51 GMT
నాన్నేమో తెలంగాణకు సీఎం, టీఆర్ఎస్ అధినేత.. అద్వితీయమైన విజయాలతో, రాజకీయ యవనికపై ఆరితేరిన నేత.. అన్నమో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. ఒంటిచేత్తో విజయాలను అందిస్తున్నారు. కానీ ఆమె మాత్రం ఓటమి పరదాల చాటున దాక్కుంటోంది. బయటకు రావడం లేదు. ఇంతకీ ఎవరామో అనేనా మీ ఫీలింగ్. కేసీఆర్ కూతురు కవిత.

నిజామాబాద్ ఎంపీగా పోటీచేసి ఓడిపోయాక కవిత టీఆర్ఎస్ లో అజ్ఞాత వాసిగానే మిగిలిపోయారు. అస్సలు బయటకు రావడం.. ఓటమి భారంతో కృంగిపోతున్నారన్న చర్చ సాగుతోంది.

ఇప్పుడు గోరుచుట్టపై రోకలి పోటులా మున్సిపల్ ఎన్నికలు కవితను మరింత బాధించాయన్న చర్చ గులాబీ పార్టీలో సాగుతోంది. నిజామాబాద్ పార్లమెంట్ లో పోటీచేసిన కవితకు ఇప్పుడు అదే నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయి. నిజామాబాద్ కార్పొరేషన్ లో సిట్టింగ్ ఎంపీ అరవింద్ సత్తా చాటారు. ఏకంగా 60కి 28 సీట్లు సాధించి ఔరా అనిపించారు. ఇక టీఆర్ఎస్ పార్టీకి కేవలం 13 సీట్లు రాగా.. మిత్రపక్షం ఎంఐఎం 16 సీట్లను గెలుచుకోగలిగింది. అయితే ఎంఐఎం-టీఆర్ఎస్, ఎక్స్ ఆఫీషియోలు కలిసి నిజామాబాద్ కార్పోరేషన్ ను లాగేసినా నైతిక విజయం మాత్రం బీజేపేదే. నిజామాబాద్ ఓటర్లు దాదాపు సగం మంది బీజేపీకి ఓటేసినట్టే..

పార్లమెంట్ ఎన్నికల్లో ఓడి మున్సిపల్ ఎన్నికల్లోనైనా నిజామాబాద్ లో టీఆర్ఎస్ కోలుకుంటే మళ్లీ అక్కడే పోటీచేయాలని కవిత భావించారట.. కానీ ఇప్పుడు మున్సిపల్ ఫలితాలతో కవిత పునరాలోచనలో పడిపోయినట్టు తెలిసింది. ఇక నిజామాబాద్ ప్రజలు తనను ఆదరించరని.. ఇక ఆ అత్తగారి ఊరు కాడి వదిలేసి తన మకాంను సొంతిళ్లు మెదక్ పార్లమెంట్ కు మారిస్తే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. హరీష్, కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ లో కవిత గెలుపు ఈజీనే. ఆదరించని నిజామాబాద్ కన్నా మెదక్ కు కవిత మారడమే బెటర్ అని గులాబీ పార్లీ లో చర్చ జరుగుతోంది.
Tags:    

Similar News