భారతి లేదా షర్మిలల్లో బతుకమ్మ అతిథెవరు?

Update: 2015-10-01 22:30 GMT
తెలంగాణకు సంబంధించినంత వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటే.. అది పూర్తిగా వైఎస్‌ షర్మిల బాధ్యత. పాపం.. రాష్ట్రం రెండు ముక్కలు అయిపోయిన నాటినుంచి.. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అస్తిత్వంలోనే ఉన్నదనే భావనను కలిగించడానికి అవసరమైన కష్టం మొత్తం ఆమె భుజాల మీద పెట్టుకున్నారు. ఎడాపెడా పరామర్శ యాత్రలు చేసేస్తూ.. ఇదివరకు తాను ఏపీలో తిరిగిన తరహాలో.. జన నీరాజనాలు లేకపోయినప్పటికీ.. ఆమె మాత్రం అదే స్థాయిలో కష్టపడుతూ ఉన్నారు. అయితే.. ఇప్పుడు తెలంగాణ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే బతుకమ్మ కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానం మాత్రం.. వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీ తరఫున అధినేత జగన్‌ భార్య భారతికి అందినట్లుగా తెలుస్తున్నది. మరి ఆడపడచు, వదినల్లో.. అతిథిగా వెళ్లే ప్రత్యేకతను నిలబెట్టుకోబోయేది ఎవ్వరు? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక సరదా చర్చనీయాంశంగా ఉంటోంది.
 
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాంద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత.. గురువారం నాడు లోటస్‌ పాండ్‌ కు వెళ్లి వైకాపా అధినేత జగన్‌ ను కలిసినట్లుగా వార్తలు వచ్చాయి. నిజానికి కేసీఆర్‌ కూతురు వెళ్లి జగన్‌ ను కలవడం అంటే... ఆ అంశానికి చిలవలుపలవలుగా అనేకానేక పుకార్లు పుట్టడానికి రాజకీయంగా ఆస్కారం ఉంది. అసలే జగన్‌.. కేసీర్‌ ట్యూన్లకు అనుగుణంగా అంటకాగుతున్నాడని.. చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా కేసీఆర్‌ తోకలిసి కుట్ర చేస్తున్నాడని ఏపీలో తెదేపా ఆరోపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్‌ కూతురు జగన్‌ ఇంటికి వెళ్లి భేటీ కావడం రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఉన్న విషయమే. అయితే.. ఇది రాజకీయ భేటీ కాదని, కేవలం జగన్‌ భార్య భారతిని బతుకమ్మకు ఆహ్వానించడానికి మాత్రమే కవిత వారి ఇంటికి వెళ్లారని కూడా వినిపిస్తోంది.

నిజానికి కవిత ఆహ్వానం మన్నించి.. భారతి వెళ్లే అవకాశం ఉంది. తెరాసతో ఎలాంటి తేడాలనూ వైకాపా తెలంగాణలో పాటించడం లేదు. వైకాపా ఎమ్మెల్యే ఆ పార్టీలోకి ఫిరాయించినా కూడా.. వారికి పెద్దగా పట్టింపులేదు. అయితే ఇవాళ భారతికి ఆహ్వానం అందిన తర్వాత.. అసలు తెలంగాణ వైకాపా బాధ్యత మొత్తాన్ని మోస్తున్న షర్మిలకు కూడా పిలుపు ఉంటుందా లేదా అన్నది సందిగ్ధంగ మారుతోంది. ఈ ఇద్దరిలో అసలు వేడుకలకు అతిథిగా ఎవ్వరు వెళ్తారన్నది కీలక విషయమే.
Tags:    

Similar News