నాన్న‌లోని 'హిట్ల‌ర్' కోణాన్ని బ‌య‌టపెట్టిన క‌విత‌!

Update: 2018-08-05 14:30 GMT
పార్టీ అధ్య‌క్షుల వారు.. మా నాయ‌కుడు.. మా అధినేత‌.. ఇలాంటి ప‌దాలే కానీ మా నాన్న అన్న మాట టీఆర్ఎస్ ఎంపీ క‌విత నోటి నుంచి రాదు. రాజ‌కీయం వేరు.. వ్య‌క్తిగ‌తం వేర‌న్న‌ట్లుగా ఉండ‌ట‌మే కాదు.. పార్టీ వేదిక‌ల మీద అధినేత కుమార్తెన‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం క‌వితలో మొద‌ట్నించి క‌నిపించ‌దు. కేసీఆర్ సూచ‌న‌ల మేర‌కే అలా వ్య‌వ‌హ‌రిస్తార‌ని చెబుతారు. కేసీఆర్ సైతం ఇదే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఏ వేదిక మీద‌నైనా.. త‌న కొడుకు.. కూతురు అన్న‌ట్లు కాకుండా.. వారి ప‌ద‌వులతోనే వ్య‌వ‌హ‌రిస్తారే కానీ.. వ్య‌క్తిగ‌త బంధాల్ని బ‌హిరంగ వేదిక‌ల మీద అస్స‌లు ప్ర‌స్తావించ‌రు.

బ‌హిరంగ వేదిక‌ల మీద  కొడుకు.. కూతురు అన్న‌ట్లు కాకుండా.. పార్టీకి చెందిన‌ మిగిలిన నేత‌ల్ని ఎలా ట్రీట్ చేస్తారో అదే రీతిలో వ్య‌వ‌హ‌రించ‌టం కేసీఆర్ కు మొద‌ట్నించి అల‌వాటు. ఈ తీరుతో అన‌వ‌స‌ర‌మైన వివాదాల్లోకి కూరుకుపోకుండా ఉన్నార‌ని చెప్పాలి. ఇంట‌ర్వ్యూల‌లో కూడా తండ్రి గురించి కుటుంబ స‌భ్యుల ప్ర‌స్తావ‌న త‌క్కువ‌గా ఉంటుంది. తాజాగా ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో గ‌తానికి భిన్నంగా ప‌లు అంశాల మీద మాట్లాడిన క‌విత‌.. త‌న తండ్రి గురించిన ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల్ని ప్ర‌స్తావించారు. వాటిల్లోకి వెళితే..

మంత్రివ‌ర్గంలో మ‌హిళ‌ను తీసుకోవాల‌న్న విష‌యాన్ని మీ నాన్న‌కు చెప్పారా? అన్న ప్ర‌శ్న‌కు.. నాన్న‌గారికి చెప్పే స్థాయి ఉంటుందా? అంటూ ఎదురు ప్ర‌శ్నించిన క‌విత‌.. అంద‌రిలా అనుకుంటారు కానీ ఆయ‌న‌కు చెప్పేంత సీను ఎవ్వ‌రికీ లేద‌ని స్ప‌ష్టం చేశారు. మీతో ఒక మాట చెప్పిస్తే కేసీఆర్ వింటార‌న్న మాట బ‌య‌ట అనుకుంటారు క‌దా  అన్న‌ప్పుడు మాత్రం ఆడ‌పిల్ల‌కు ఉండే అడ్వాంటేజ్ ను క‌విత చెప్పారు.

అన్న‌య్య కంటే ఒక మాట ఎక్కువ చెబుతానేమో?  కాక‌పోతే.. చాలా స్ట్రిక్ట్ బాస్ అండి నాన్న‌గార‌ని చెప్పారు. నాన్న‌గారు భ‌యంక‌ర‌మైన బాస్ అని.. ఆయ‌న్ను త‌ట్టుకోలేమ‌న్న క‌విత‌.. ఎవ‌రైనా వారి హ‌ద్దుల్లో ఉండాల‌ని.. చివ‌ర‌కు త‌ను కూడా అని చెప్పారు.

కేసీఆర్ వంద చెబితే వెయ్యి చేయాల‌ని.. అలా చేసిన త‌ర్వాత కూడా తిట్లు ప‌డ‌వ‌న్న గ్యారెంటీ ఉంద‌న్న మాట‌ను చెప్పిన కవిత‌.. కేసీఆర్ ను త‌ట్టుకోవ‌టం సాధ్యం కాద‌న్నారు. కేసీఆర్ కు కోపం వ‌స్తే ఎవ‌రూ ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లే సాహ‌సం చేయ‌ర‌ని చెబుతారు నిజ‌మేనా? అంటే.. తాను వెళ్తాన‌ని.. ఎందుకు కోపంగా ఉన్నారు?  విష‌యం ఏమిట‌ని ఆరా తీసే చ‌నువు త‌న‌కుంద‌ని పేర్కొన్నారు.

కేటీఆర్ పిల్ల‌ల్ని.. మీ పిల్ల‌ల్ని నాన్న బాగా గారాబం చేస్తార‌ట అన్న ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. అవునని చెప్పారు. త‌మ‌ను ఎంత స్ట్రిక్ట్ గా పెంచారో.. త‌మ పిల్ల‌ల్ని అంత గారాబం చేస్తార‌న్నారు. త‌మ‌తో క‌నీస స‌మ‌యాన్ని కూడా గ‌డ‌ప‌లేద‌ని.. మ‌న‌వ‌ళ్ల‌ను విష‌యంలో మాత్రం బ‌డికి వెళ్ల‌క‌పోతే.. ఒక్క‌రోజు పోకుంటే ఏమ‌వుతుందిలే అని వెన‌కేసుకొస్తార‌న్నారు. గారాబం చేసి చెడ‌గొడ‌తార‌ని.. త‌మ పిల్ల‌ల్ని చూసుకొని తాము కుళ్లుకుంటామ‌ని న‌వ్వుతూ బ‌దులివ్వ‌టం విశేషం.

Tags:    

Similar News