కవితక్క 'దత్తత'తో డేంజర్‌ యమడేంజర్‌!

Update: 2015-09-14 05:26 GMT
తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న ఉదంతాలపై రోజురోజుకూ విమర్శలు శృతిమించుతున్నాయి. విపరీతంగా చర్చ జరుగుతోంది. పాలకపక్షం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నదని విపక్షాలన్నీ హోరెత్తించేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో హైదరాబాదు నగరంలో జరిగిన ఒక రౌండ్‌టేబుల్‌ సమావేశంలో కేసీఆర్‌ కూతురు, ఎంపీ కవిత.. ఒక కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాల్ని అన్ని విధాలుగానూ ఆదుకోవడానికి ఇలా దత్తత ఆలోచన చేస్తున్నట్లు ఆమె చెప్పారు.

అయితే ఈ దత్తత కార్యక్రమంలోకి కార్పొరేట్‌ సంస్థల్ని - స్వచ్ఛంద సంస్థల్ని - సీఎస్సార్‌ కింద ఏటా కొన్ని లక్షల నిధులు వెచ్చిస్తూ ఉండే పెద్ద సంస్థలను భాగస్వాముల్ని చేయాలని కవిత ఆలోచిస్తున్నట్లుగా ఆమె చెప్పిన మాటలను బట్టి అనిపిస్తోంది.

అయితే ప్రభుత్వంలో ఉన్న పార్టీకి చెందిన, బాధ్యతాయుతమైన ఎంపీ కూడా అయిన కవిత చెబుతున్న మాటలు.. పలాయనవాదానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. రైతుల్లో అసలు ఆత్మహత్యలే జరగకుండా చూడడానికి వ్యవసాయం పట్ల వారికి భరోసా కల్పించడానికి ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యల సంగతి వదిలేసి చచ్చిపోయిన వారి కుటుంబాలను దత్తత తీసుకుని పోషిస్తాం అనడం.. పలాయన వాదం కాక మరేంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కుటుంబయజమాని ఆత్మహత్య చేసుకుంటే.. వారి కుటుంబాన్ని ఎవరో ఒకరు దత్తత తీసుకుని వారి అవసరాలు సకలం చూసుకుంటారు అనే అభిప్రాయం వ్యాప్తిలోకి వస్తే గనుక.. ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోతుందనే భయం కూడా ఉంది. తమ తదనంతరం కనీసం ఈ కుటుంబానికి ఇబ్బంది లేకుండా అన్నీ జరిగిపోతాయి అనుకుంటే చాలు.. నిరాశలో ఉన్న చాలామంది రైతులు ఇలాంటి 'దత్తత' భరోసా వలన ఆత్మహత్య వైపు వెళ్లే ప్రమాదం ఉంటుందని పలువురు విశ్లేసిస్తున్నారు. కవితక్క దత్తత మాటలు.. రైతులకు బతకడానికి ఇస్తున్న భరోసా లాగా లేదని... చావడానికి ఇస్తున్న భరోసాలాగా ఉంటున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News