టీఆర్ ఎస్ పేరు మార్చేసిన క‌విత‌

Update: 2017-04-27 10:47 GMT
టీఆర్‌ ఎస్ పార్టీ పూర్తిపేరు ఏంటి? ఇది తెలియ‌దా? తెలంగాణ రాష్ట్ర సమితి అని అంటారా!  ఇప్పుడు ఆ పార్టీ పేరు మారిపోయిన‌ట్లుంది. ఎలా? ఎప్పుడు అంటే గులాబీ ద‌ళ‌ప‌తి - సీఎం కేసీఆర్ త‌న‌య అయిన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కొత్త పేరు చెప్పారు కాబ‌ట్టి. టీఆర్ ఎస్ ఆవిర్భ‌వించి 16 ఏళ్లు నిండుతున్న సంద‌ర్భంగా వ‌రంగ‌ల్‌ లో  అంగ‌రంగ వైభ‌వంగా `ప్రగతి నివేదన సభా` నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భగా స‌భ‌కు హాజ‌రై ఎంపీ క‌విత ఓ చానెల్‌ తో కవిత మాట్లాడుతూ...రైతుల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. త‌ద్వారా టీఆర్ ఎస్ అంటే తెలుగు రైతు స‌మితిగా మారింద‌ని విశ్లేషించారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే టీఆర్ ఎస్ పార్టీ నినాదమని ఎంపీ క‌విత విశ్లేషించారు. బంగారు తెలంగాణ నిర్మాణమే తమ ధ్యేయమని క‌విత‌ ప్రకటించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రసంగం కోసం రైతులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్ర‌గ‌తి నివేద‌న‌ సభలో ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూనే.. భవిష్యత్‌ లో చేపట్టబోయే కార్యక్రమాలను గురించి సీఎం వివరిస్తారని క‌విత పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఏది చేసినా విజయవంతమే అవుతుంద‌ని పేర్కొంటూ ఇందుకు ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయని క‌విత తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యావత్ తెలంగాణకు వరంగల్ నగరం ఉద్యమ దిక్సూచిగా నిలిచిందన్నారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఓరుగల్లు నగరంలో టీఆర్‌ ఎస్ ఆవిర్భావ సభ జరగడం సంతోషాన్నిస్తుందని కవిత అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News