రాజ్య‌స‌భ‌ కు క‌విత‌క్క‌!

Update: 2021-11-19 03:56 GMT
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల న‌గారా మోగ‌డంతో ఊహాగానాల రాజ‌కీయ‌మే ఎక్కువ‌గా సాగుతోంది. ఎమ్మెల్యేల కోటా కింద వాళ్ల‌కు అవ‌కాశం వ‌స్తుంద‌ని.. స్థానిక సంస్థ‌ల కోటా కింద వీళ్ల‌ను ఎమ్మెల్సీలుగా చేస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇప్ప‌టికే ఎమ్మెల్యే కోటా స్థాన‌ల‌కు కేసీఆర్ ఆరుగురు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం వాళ్లు నామినేష‌న్లు వేయ‌డం జ‌రిగిపోయింది. పోటీ లేక‌పోవ‌డంతో ఆ ఆరుగురి ఎన్నిక ఏక‌గ్రీవం కానుంది.

అయితే ఆ స్థానాల కోసం పార్టీ ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల జాబితాలో రాజ్య స‌భ స‌భ్యుడైన బండా ప్ర‌కాశ్ పేరుండ‌డంతో ఇప్పుడు కొత్త ప్ర‌చారం ఊపందుకుంది. ఆ ప‌ద‌వికి మ‌రో రెండేళ్ల‌కు పైగా గ‌డువు ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న్ని కేసీఆర్ ఎమ్మెల్సీ చేస్తున్నారు. దీంతో ప్ర‌కాశ్ త‌న రాజ్య స‌భ ప‌ద‌విని వ‌దులుకున్నారు. ఇప్పుడా ప‌ద‌విని కేసీఆర్ ఎవ‌రికి ఇస్తార‌నే స‌స్పెన్స్ నెల‌కొంది.

కూతుర్ని పంపిస్తారా?

ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో కేసీఆర్ త‌న త‌న‌య ఎమ్మెల్సీ క‌విత‌నే రాజ్య‌స‌భకు పంపిస్తార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. రాజ్య స‌భ ఎంపీ అవ‌కాశం ఆమెకే ద‌క్కేనందునే ప్ర‌చారం మొద‌లైంది. ప్ర‌స్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా ఉన్న ఆమె ప‌ద‌వీ కాలం వ‌చ్చే జ‌న‌వ‌రి 4తో ముగుస్తుంది. ఇప్ప‌టికే ఆమె స్థానంతో క‌లిపి మొత్తం 12 స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.

గ‌తేడాది ఆ ఎమ్మెల్సీ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో క‌విత గెలిచారు. కాబ‌ట్టి ఆమెను మ‌రోసారి ఎమ్మెల్సీ చేస్తార‌నే అభిప్రాయాలు మొద‌ట వ్య‌క్త‌మ‌య్యాయి. అంత‌కంటే ముందు ఆమెను గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీని చేస్తార‌నే ప్ర‌చారం వినిపించింది. నిజామాబాద్ నుంచి ఆ కోటాలో ఎమ్మెల్సీగా చేసిన ఆకుల ల‌లిత ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో ఆమె స్థానంలో క‌విత‌ను ఎమ్మెల్సీ చేస్తార‌ని అనుకున్న‌ట్లు స‌మాచారం.


ఆ ఓట‌మితో..

2014 లోక‌స‌భ ఎన్నిక‌ల్లో ఎంపీగా గెలిచిన క‌విత‌.. 2019లో బీజేపీ అభ్య‌ర్థి అర‌వింద్ చేతిలో ఓడారు. దీంతో కొంత కాలం పాటు ఆమె రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. కానీ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా ఉన్న భూప‌తి రెడ్డి పార్టీ మారి ఆ ప‌ద‌వి పోగొట్టుకున్నారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక వ‌చ్చింది.

2020 అక్టోబ‌ర్ 9న జ‌రిగిన ఆ ఉప ఎన్నిక‌లో గెలిచిన క‌విత మ‌ళ్లీ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్ప‌డం మొద‌లెట్టారు. ఎమ్మెల్సీగా గెలిచిన ఆమెను కేసీఆర్ మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటారేమోన‌న్న వార్త‌లు అప్పుడు వ‌చ్చాయి. కానీ అలా చేస్తే విప‌క్షాలు విమ‌ర్శ‌ల‌కు తావిచ్చిన‌ట్లు అవుతుంద‌నే ఉద్దేశంతో కేసీఆర్ ఆగిపోయార‌ని స‌మాచారం.

కానీ ఇప్పుడేమో ఆమెను రాజ్యస‌భ ఎంపీగా చేయాల‌ని కేసీఆర్ అనుకుంటున్న‌ట్లు తెలిసింది. గ‌తంలో ఏంపీగా తెలంగాణ ప్ర‌యోజ‌నాల కోసం లోక్‌స‌భ‌లో త‌న గ‌ళాన్ని వినిపించిన ఆమె సేవ‌లు ఇప్పుడు రాజ్య‌స‌భ ఎంపీగా అవ‌స‌ర‌మ‌నే భావ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు స‌మాచారం. క‌విత స‌రేనంటే ఆమె రాజ్య‌స‌భ ఎంపీ కావ‌డం ఖాయం. కానీ ఒక‌వేళ ఆమె ఆస‌క్తి చూపించ‌క‌పోతే మాజీ అసెంబ్లీ స్పీక‌ర్ మధుసూద‌న‌చారిని రాజ్య‌స‌భ‌కు పంపించాల‌ని కేసీఆర్ అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News