వీర సమైక్యవాదులు నోరు విప్పరా?

Update: 2015-08-16 04:40 GMT
రాష్ట్రం ఏదైనా.. వారి ప్రయోజనాలు దెబ్బ తింటున్నాయంటే ప్రజలు.. రాజకీయ నాయకులు విరుచుకుపడుతుంటారు. తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తుంటారు. ఇలాంటి వైఖరి మిగిలిన రాష్ట్రాల్లోకనిపిస్తుంది కానీ.. ఏపీలో మాత్రం కనిపించదు.

ఓ పక్క రాష్ట్ర ప్రయోజనాలు భారీగా దెబ్బ తింటాయని అర్థం అవుతున్నా.. తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించటం ఏపీ నేతలకు మాత్రమే చెల్లుతుంది. తమను నడిపించే సరైన నాయకుడు లేక.. సీమాంధ్రులు తెగ ఫీలవుతున్న పరిస్థితి. రాష్ట్ర విబజనతో కష్టాలు మొదలైన ఏపీకి.. విభజన సమయంలో ఇచ్చిన హామీల కారణంగా పరిస్థితి ఎంతోకొంత మెరుగు అవుతుందని భావించారు. అందుకు భిన్నంగా.. అలాంటిదేమీ కనిపించకపోవటంతో ఆందోళన రోజురోజుకీ పెరుగుతోంది.

విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో ప్రత్యేక హోదా అత్యంత కీలకమైన హామీ. అయితే.. ఈ హామీని తుంగలో తొక్కేసిన కేంద్రం.. ఎవరేం చెప్పినా వినేందుకు సిద్ధంగా లేనట్లుగా ఇప్పటికే తన వైఖరిని పలుమార్లు కుండ బద్ధలు కొట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా సాధన అంత తేలికైన విషయం కాదు.

రాజకీయ పక్షాలు ఫెద్దఎత్తున పోరాడితే తప్పితే ప్రయోజనం ఉండని పరిస్థితి. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. రాష్ట్ర విభజన సందర్భంగా ఏ నేతలైతే విభజనకు వ్యతిరేకంగా గళం విప్పి.. దేనికైనా సై అన్నట్లుగా వ్యవహరించారో అలాంటి వారంతా ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు.

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.. లగడపాటి రాజగోపాల్.. ఉండవల్లి అరుణ్  కమార్.. సబ్బం హరి లాంటి వారంతా మౌనముద్రతో ఉన్నారు. ఇక.. తాము సమైక్యవాదులమని.. సమైక్యం కోసం తెర వెనుక చాలానే ప్రయత్నాలు చేశామని చెప్పుకునే కావూరి సాంబశివరావు.. పురందేశ్వరి లాంటి నేతల నోటి వెంట కూడా మాట రాని పరిస్థితి. వీరిలోకొందరు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారితే.. మరికొందరు రాజకీయాలకు దూరంగా ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఎవరికి వారు.. ఏపీ ప్రయోజనాల కోసం పెద్దగా పట్టనట్లుగా వ్యవహరించటం.. ఏపీకి శాపంగా మారింది. వీర సమైక్యవాదుల పరిస్థితే ఉంటే.. మిగిలిన వారికి సీమాంధ్ర ప్రయోజనాలు పడతాయా? అన్నది పెద్ద సందేహంగా మారింది.
Tags:    

Similar News