గుడ్‌ బై బాబు త‌ప్పిద‌మే..మాకు మంచి చాన్సిచ్చారు

Update: 2018-03-16 08:15 GMT
మిత్ర‌ప‌క్షాలుగా ఇన్నాళ్లుగా కొన‌సాగిన టీడీపీ-బీజేపీల బంధం నోటితో పొగిడి..నొస‌లితో వెక్కిరించిన‌ట్లుగానే ఉంద‌నే వాద‌న‌లు నిజం చేసేలా ప్ర‌స్తుత ప‌రిణామాలు సాగుతున్నాయి. కొద్దికాలంగా కొన‌సాగుతున్న చ‌ర్చ‌ల‌కు తెర‌దించుతూ ఎన్డీఏకు టీడీపీ గుడ్‌ బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ప‌రిణామంపై బీజేపీ ఎలాంటి షాక్‌ కు గురికాలేదు. పైగా త‌మ ఆనందాన్ని వ్య‌క్త‌ప‌రిచింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి - తెలుగు బిడ్డ అయిన జీవీఎల్‌ నరసింహారావు తాజా ప‌రిణామంపై స్పందిస్తూ ఎన్‌డిఎనుంచి తెలుగుదేశం పార్టీ బైటకు వెళ్లడం వ్యూహాత్మక తప్పిదమని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదని తెలిపారు. 29 సార్లు ఢిల్లి వెళ్లినప్పటికీ కేంద్రం రాష్ట్రానికి ఏమీ చేయలేదని చంద్రబాబు నాయుడు చెప్పడం ఆయన అసమర్ధతకు నిదర్శనమని నరసింహారావు ఎద్దేవా చేశారు. ఏపీలో తాము బలపడేందుకు ఇదే సరైన అవకాశమని జీవిఎల్ నరసింహరావు చెప్పారు. తద్వారా త‌మ పార్టీ `ఫీలింగ్‌`ను ఆయ‌న‌ ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు.  రాజకీయ ఎత్తుగడల కోసమే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నారని జీవీఎల్ మండిప‌డ్డారు.

కాగా, ఎన్‌ డీఎ కూటమినుంచి టీడీపీ వైదొలగడంపై అదే కూట‌మిలో ఉన్న‌ జెడియు నేత కెసి త్యాగి స్పందించారు. ఎన్‌ డిఎ నుంచి టీడీపీ వైదొలగడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. పెద్ద కూటమిలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలుంటాయని ఆయన అన్నారు. ఎన్‌ డిఎ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని ఆయన చెప్పారు. మ‌రోవైపు ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలగిన నేప‌థ్యంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలను హస్తిన రావలసిందిగా అధిష్టానం ఆదేశించింది. ఈ మేరకు ఏపీలోని బీజేపీ ముఖ్యనేతలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కార్యాలయం నుంచి సమాచారం అందించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు ఢిల్లీలోనే ఉన్నారు. ఇతర ముఖ్య నేతలకు హస్తిన రావలసిందిగా బీజేపీ అధిష్టానం నుంచి ఆదేశాలు అందాయి.
Tags:    

Similar News