ఆర్టీసీ సమ్మె పై సిద్దమైన కేసీఆర్ యాక్షన్ ప్లాన్!

Update: 2019-10-29 09:50 GMT
తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 25 రోజులకి చేరింది. ఈ సమ్మె పై అటు కార్మికులు కానీ - ఇటు ప్రభుత్వ కానీ వెనక్కి తగ్గకపోవడంతో మధ్యలో రాష్ట్ర ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. సమ్మె అర్థం పర్థం లేనిది అంటూ మొదటినుండి చెప్తూ వస్తున్న సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై తన యాక్షన్ ప్లాన్‌ రెడీ చేసారు. సమయం సందర్భం లేకుండా సమ్మెలు చేస్తున్న కార్మికుల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేమని చెప్పారు.

ఇదే సమయంలో సమ్మె చేస్తున్న కార్మికులకు దిమ్మతిరిగే రేంజ్ లో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసారు. కార్పొరేషన్‌ కు చెందిన బస్సులు - కార్మికులతో కొద్దిపాటు సర్వీసులను నడిపిస్తూనే - రాష్ట్రంలోని మొత్తం రూట్లలో ప్రధాన రూట్లలో బస్సులను తిప్పేందుకు  ప్రైవేటు ఆపరేటర్లను నుంచి టెండర్లను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి కెసీఆర్ నిర్ణయించారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 3 నుంచి 4 వేల రూట్లను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాలని కెసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించడమే తరువాయి అంటున్నారు. ముసాయిదా సిద్దం కాగానే తెలంగాణ కేబినెట్ భేటీ నిర్వహించి ఈ ప్రతిపాదనను ఆమోదించబోతున్నట్లు సమాచారం.

అద్దె బస్సుల కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌ కు భారీగా స్పందన వచ్చినట్లు సమాచారం. వెయ్యి బస్సుల కోసం టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తే.. 21 వేల 453 అప్లికేషన్లు వచ్చాయని  అధికారులు చెబుతున్నారు. అయితే.. 4 వేల బస్సులను అద్దెకు తీసుకుంటే తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రభావం అస్సలే కనిపించదని అధికారులు అంటున్నారు.సంస్థను 50శాతం ప్రైవేటు పరం చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రధాన రహదారులపై సాగే దూర ప్రాంత సర్వీసులను ప్రైవేటు వారికిచ్చి.. గ్రామీణ ప్రాంతంలో మాత్రం ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ ఆధ్వర్యంలో బస్సులు నడపాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.
Tags:    

Similar News