కేసీఆర్‌ కు ఏడాది పాటు అదొక్కటే టార్గెట్‌

Update: 2017-08-07 17:30 GMT
గులాబీ ద‌ళ‌ప‌తి - తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు త‌న పంథా మార్చుకునేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు వివిధ వ‌ర్గాల‌ను త‌న నూత‌న నివాస‌మైన ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ కు పిలిపించి చర్చ‌లు జ‌రిపిన కేసీఆర్ ఇక నుంచి ప్లాన్ మార్చ‌నున్నారట‌. స్వ‌యంగా తానే ప్రజా క్షేత్రంలోకి వెళ్లేందుకు నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయి పర్యటనలకు షెడ్యూల్‌ ఖరారు చేసుకున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి - సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన వారందరికీ అందాలన్న లక్ష్యంతో ఈ యాత్ర ఉండ‌నున్న‌ట్లు చెప్తున్న‌ప్ప‌టికీ....ఇటు ప్రభుత్వ కార్య‌క్ర‌మాల ప్ర‌చారం, అటు ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకుప‌డ‌టం అనే రెండు అజెండాల‌తో కేసీఆర్ ఈ టూర్ మ్యాప్ గీసిన‌ట్లు తెలుస్తోంది.

ప్రతిపక్షాలు పనిగట్టుకుని ప్రభుత్వంపై బురదజల్లుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తాను ప్రజా క్షేత్రంలోకి వెళ్తానంటూ ఇటీవలే ప్రకటించిన కేసీఆర్‌ ప్రతిరోజూ ఏదో ఒక జిల్లాలో రెండు గ్రామాలను సందర్శించి స్థానిక ప్రజల బాగోగులు స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించారు. ఈ క్ర‌మంలోనే మేడ్చ‌ల్‌ - సిద్ధిపేట జిల్లాల్లోని కొన్ని గ్రామాలను సందర్శించి  ప్రజా సమస్యలు - వాటి పరిష్కారానికి ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను వెల్లడించారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యాచరణ ప్రణాళిక ప్రకారం మొదటి దశలో జిల్లా కేంద్రాలు - రెవెన్యూ డివిజనల్‌ కేంద్రాల్లో పర్యటించాలనుకున్నప్పటికీ గ్రామస్థాయి నుంచి మొదలుపెట్టారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం  దీన్ని మ‌రింత విస్తృత ప‌ర్చ‌డంలో భాగంగా ఇదే రీతిలో ఏడాది పాటు నిరంతరంగా కొనసాగేలా జిల్లాల ప‌ర్య‌ట‌న‌ను కేసీఆర్‌ పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. ఏడాది తర్వాత రెండో విడతగా చేపట్టే క్షేత్రస్థాయి పర్యటనల్లో మండల కేంద్రాల్లో పర్యటించనున్నట్లు స‌ద‌రు స‌న్నిహితవ‌ర్గాల స‌మాచారం. అవసరమైతే జిల్లా, డివిజన్‌ కేంద్రాల స్థాయిలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజలతో మమేకమయ్యేందుకు కేసీఆర్‌ భవిష్యత్‌ వ్యూహాలను రచిస్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌ల ద్వారా తెలంగాణాను సస్యశ్యామలం చేయడానికి ఎంచుకున్న లక్ష్యాలను, ఇప్పటివరకు సాధించిన ఫలితాలను వివరించనున్నారు. వివిధ అంశాలను రాజకీయం చేస్తూ లబ్ధి పొందేందుకు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్న నేపథ్యంలో తానే స్వయంగా ప్రజల్లోకి వెళ్ళి వాస్తవాలు వెల్లడించేందుకు సిద్ధమయిన‌ట్లు వివ‌రించ‌నున్నారు. తెలంగాణ పునర్‌నిర్మాణంలో భాగంగా చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో రాష్ట్రానికి చేకూరే ప్రయోజనం, తద్వారా పేద, మధ్యతరగతి వర్గాలు, ముఖ్యంగా రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా చేకూరే లబ్ధిని వెల్లడించబోతున్నారు. అలాగే భావితరాల సంక్షేమానికి శాశ్వత ప్రాతిపదికన చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను గ్రామగ్రామాన ప్రకటించనున్నారు.సుదీర్ఘ కార్య‌క్ర‌మం అయినందున ప్రొటొకాల్‌ అధికారులు అన్ని సౌకర్యాలతో కూడిన ప్రత్యేక బస్సును ఇప్ప‌టికే ఏర్పాటు చేశారు.

రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రతిపక్ష కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు దిగజారుతున్న తీరును ప్రజల్లో ఎండగట్టాలన్న ఉద్దేశంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు అధికారపార్టీ వెర్గాలు చెబుతున్నాయి. సుపరిపాలనకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి వాటికి అనుగుణంగానే రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకుని ముందడుగు వేయాలన్నది కేసీఆర్‌ ఆలోచనగా చెప్తున్నారు. పేరుకుపోయిన సమస్యలను వెలికితీసి వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు.ఇలాంటి పర్యటనలతో ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు 2019 ఎన్నికల నాటికి మరింత అభిమానం చూరగొనాలన్నది కేసీఆర్ వ్యూహాత్మ‌క నిర్ణ‌య‌మ‌ని అంటున్నారు.
Tags:    

Similar News