సీఎం నియోజ‌క‌వ‌ర్గంలోనే నీటి ఆందోళ‌న‌

Update: 2016-04-19 09:23 GMT
సీఎం కేసీఆర్‌ నియోజకవర్గం... అందునా దత్తత గ్రామమైన నర్సన్నపేటలో 15 రోజులుగా ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్పంచ్‌ కు - కార్యదర్శికి చెప్పినా పట్టించుకోవడం లేదన్న ఆగ్రహంతో గ్రామస్తులు రోడ్డెక్కారు. మెదక్‌ జిల్లా జగదేవపూర్‌ మండలం నర్సన్నపేట గ్రామంలో నర్సన్నపేట- ఎర్రవల్లి రోడ్డుపై దాదాపు గంటపాటు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బోరు మోటార్లు కాలిపోవడంతో 15 రోజులుగా నీటి సమస్య నెలకొందని చెప్పారు.

దీనిపై సర్పంచ్‌ బాల్‌ రెడ్డికి - కార్యదర్శి స్వప్నకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలే వేసవి కాలం...నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. సీఎం దత్తత గ్రామంలోనే ఇలా ఉంటే మిగతా గ్రామాల పరిస్ధ్థితి ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఫాంహౌజ్‌ వైపు వెళ్తున్న సీఐ సతీష్‌ సమస్యను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్‌ లో తెలియజేశారు. సీఐ - సర్పంచ్‌ బాల్‌ రెడ్డి స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తాగునీటి సమస్యను రెండు రోజుల్లో పరిష్కరిస్తామని సర్పంచ్‌ హామీనివ్వడంతో ఆందోళన విరమించారు.

Tags:    

Similar News