గొర్రెల‌తోటే రూ.ల‌క్ష కోట్లు తేవొచ్చా కేసీఆర్‌!

Update: 2017-06-21 05:47 GMT
ఏదైనా కొత్త వ్యాపారం స్టార్ట్ చేసే ముందు.. రంగుల క‌ల‌లు చాలానే కంటుంటారు. వ్యాపారం స్టార్ట్ చేయ‌టం మొద‌లైతే చాలు.. లాభాల మీద లాభాలు వ‌చ్చేస్తాయ‌న్న మాట‌లు చెబుతుంటారు. అదెలా అంటే.. నోటి లెక్క‌లు.. కాదంటే కాగితం మీద లెక్క‌లు రాసేసి చూపిస్తారు.

అయితే.. అదంతా జ‌ర‌గాలంటే.. మాట‌ల్లో చెప్పినంత తేలిక‌ ఎంత‌మాత్రం కాదు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మాటలు చూస్తే ఇదే ముచ్చ‌ట గుర్తుకు రాక మాన‌దు.తాను చేప‌ట్టే కార్య‌క్ర‌మం ఏదైనా స‌రే.. దాన్ని గొప్ప‌గా ప్రొజెక్ట్ చేసుకోవ‌టం కేసీఆర్‌ కు అల‌వాటే. ఆయ‌న మాట‌లు వింటే.. జ‌రిగిపోతుంద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. అయితే.. వాస్త‌వంలో అదెంత నిజం అన్న‌దే అస‌లు ప్ర‌శ్న‌. మాట‌ల‌కు చేత‌ల‌కు మ‌ధ్య‌న ఉండే వ్య‌త్యాసాన్ని చెప్పాల్సి వ‌స్తే.. ఒక ముచ్చ‌ట‌ను ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన అవ‌స‌రం ఉంది.

 ఏడాది క్రితం వ‌ర్షాకాలం ఆరంభంలో కోట్లాది మొక్క‌లు నాటే కార్యక్రమాన్ని షురూ చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నోటి నుంచి చాలానే మాట‌లు వ‌చ్చాయి. కోట్లాది మొక్క‌ల్ని వంద‌ల కోట్ల రూపాయిలు ఖ‌ర్చు చేసి ఎంత బాగా డెవ‌ల‌ప్ చేశామో చెప్ప‌ట‌మే కాదు.. త‌మ ప్లాన్ ఎంత ప‌క్కాగా ఉందో వివ‌రించారు. తాను మొద‌లుపెట్టిన మొక్క‌లు నాటే కార్యక్రమం తో ఏడాది తిరిగేస‌రికి తెలంగాణ‌లో ప‌చ్చ‌టి ప‌రిస‌రాలు క‌నిపిస్తాయని.. రానున్న రోజుల్లో అది మ‌రింత పెరగ‌టం ఖాయ‌మ‌ని న‌మ్మ‌కంగా చెప్ప‌టాన్ని మ‌ర్చిపోలేం.

మ‌రి.. అన్ని వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టి త‌యారు చేసిన మొక్క‌ల్ని యుద్ధ ప్రాతిప‌దిక‌న నాటిన విష‌యం అంద‌రికి తెలిసిందే. ఏడాది గ‌డిచిన త‌ర్వాత‌.. అలా నాటిన మొక్క‌ల్లో ఎన్ని బ‌తికి ఉన్నాయి? ఎంత మేర తెలంగాణ రాష్ట్రంలో ప‌చ్చ‌ద‌నం పెరిగిందో చెబితే బాగుంటుంది. ఇక్క‌డ చెప్పేదేమంటే.. మాట‌ల్లో క‌నిపించిన గొప్ప చేత‌ల్లో సాధ్యం కాద‌నే.

మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మంలో భాగంగా తాను హెలికాఫ్ట‌ర్ వేసుకొని వెళ‌తాన‌ని.. ప‌చ్చ‌ద‌నాన్ని తానుస్వ‌యంగా ప‌రిశీలిస్తాన‌ని చెప్పారు. ఏడాది గ‌డిచింది. ఎన్ని ఊళ్ల‌కు కేసీఆర్ హెలికాఫ్ట‌ర్ వేసుకొని వెళ్లి వ‌చ్చారో అంద‌రికి తెలిసిందే. మొక్క‌ల ముచ్చ‌ట పోయి.. ఇప్పుడు గొర్రెల ముచ్చ‌ట వ‌చ్చింది. గొల్ల కురుమ‌ల‌కు గొర్రెల్ని ఉచితంగా పంపిణీ చేయ‌ట‌మే కాదు.. ఆ గొర్రెల‌తో అద్భుతాలు సృష్టించ‌నున్న‌ట్లుగా కేసీఆర్ చెబుతున్నారు.

త‌మ ప్ర‌భుత్వం ఇప్పుడు పంపిణీ చేస్తున్న గొర్రెల‌తో మూడేళ్ల‌లో ఏంజ‌రుగుతుంద‌న్న‌ది మూడు నిమిషాల్లో రంగుల సినిమాను చూపించ‌ట‌మే కాదు.. వామ్మో.. అన్ని డ‌బ్బులు ఉత్త గొర్రెల మీద వ‌స్తాయా? అన్న భావ‌న క‌లిగేలా  చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం గొర్రెల పెంప‌కందారుల వ‌ద్ద కోటి గొర్రెలు ఉన్నాయ‌ని.. వాటికి త‌మ ప్ర‌భుత్వం అందించే కోటిన్న‌ర గొర్రెల్ని క‌లిపితే మొత్తం రెండున్న‌ర కోట్లు అవుతాయ‌ని.. ఏడాదికి రెండు ఈత‌ల లెక్క‌న‌.. రానున్న రెండున్న‌రేళ్ల వ్య‌వ‌ధిలో 7.5 కోట్లు అవుతాయ‌ని.. వాటిల్లో 2.5 కోట్ల గొర్రెల్ని త‌మ ద‌గ్గ‌ర ఉంచుకొని 5 కోట్ల గొర్రెల్ని అమ్మినా తెలంగాణ స‌మాజంలో గొల్ల కురుమ‌ల ద్వారానే రూ.25వేల కోట్ల ఆదాయాన్ని సృష్టించ‌నున్న‌ట్లుగా చెప్పారు. రోజుకు 650 గొర్రెల్ని దిగుమ‌తి చేసుకునే ప‌రిస్థితి నుంచి 6500 గొర్రెల్ని ఎగుమ‌తి చేసే ప‌రిస్థితికి రావాల‌న్న అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.

కేసీఆర్ నోటి నుంచి వ‌స్తున్న మాట‌లు వింటే.. గొర్రెల‌తో ఇంత అద్భుతం చేయొచ్చా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. మ‌రి.. రూ.25వేల కోట్ల సంప‌ద‌ను గొర్రెల‌తో సృష్టిస్తాన‌ని చెప్పే కేసీఆర్‌కు ఒక్క ప్ర‌శ్న వేయాల‌నిపించ‌క మాన‌దు. మ‌రీ ఐడియా దేశంలో కేసీఆర్‌కే వ‌చ్చింద‌నుకుందాం. ప్ర‌పంచంలో ఇలాంటి ఐడియా ఏ దేశానికి రాలేదా? అన్న‌ది ప్ర‌శ్న‌. మిగిలిన‌వ‌న్నీ వ‌దిలేసి.. ఒక్క గొర్రెల మీద ఫోకస్ చేస్తే.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక గొర్రెల్ని ఎగుమ‌తి చేయ‌ట‌మో.. గొర్రె మాంసాన్ని పంపిణీ చేసే దేశంగా మారిపోవ‌చ్చుగా. ర‌క‌ర‌కాల కంపెనీలు.. భారీ పెట్టుబ‌డులు పెట్టే క‌న్నా.. గొర్రెల‌తోనే ల‌క్ష‌ల కోట్ల రూపాయిలు సంపాదించొచ్చుగా? మ‌రి.. అలాంటి ప‌ని ఎవ‌రూ ఎందుకు చేయ‌న‌ట్లు? ఆ విష‌యాన్ని ఆలోచిస్తే.. ప్రాక్టిక‌ల్ ప్రాబ్ల‌మ్స్ ఇట్టే అర్థ‌మ‌వుతాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News