ఈసారైనా కేసీఆర్ కు మోడీ ఓకే చెబుతారా?

Update: 2016-01-19 04:35 GMT
ప్రధానమంత్రి మోడీ కొన్ని విషయాల్లో చాలా కరుకుగా ఉంటారు. మేనేజ్ మెంట్ గురులా మాట్లాడే మోడీ తనను మాటలతో హర్ట్ చేసే వారి విషయంలో అంతకంతకూ అన్నట్లుగా వ్యవహరించి.. వారిని ముప్ప తిప్పలు పెడతారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీని ఓ రేంజ్ లో ఏకేసిన కేసీఆర్ ను.. ఆ తర్వాత ఎలా దూరం పెట్టారో తెలిసిందే.

గత కొద్ది నెలలుగా మోడీతో భేటీ కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నా.. అపాయింట్ మెంట్ ఫిక్స్ కాకపోవటం గమనార్హం. మోడీని కలిసేందుకు ఎంతగా ప్రయత్నించినా.. కేసీఆర్ కు కనీసం అపాయింట్ మెంట్ కూడా దొరకని దుస్థితి. ఈ మధ్యనే రామోజీ ఫిలింసిటీలో జరిగిన రియల్టర్ సదస్సుకు హాజరైన కేసీఆర్.. మోడీ పని తీరు మీదా.. ఆయన విజన్ మీదా పెద్ద ఎత్తున పొగిడేశారు.  మోడీ విజన్ ను కీర్తించారు.

 ఒకవైపు ప్రధాని మోడీని కేసీఆర్ పొగిడేస్తుంటే.. మరోవైపు ఆయన కుమారుడు.. తెలంగాణ రాష్ట్రమంత్రి కేటీఆర్.. ఆయన కుమార్తె కమ్ ఎంపీ కవితలు మాత్రం మోడీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో.. హైదరాబాద్ నగరంలో బీజేపీని బద్నాం చేసేందుకు వీలుగా.. ఆ పార్టీ ఏమీ చేయలేదనటానికి వీలుగా మోడీని సీన్లోకి తీసుకొచ్చి మరీ విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయనపై పలు విమర్శలు.. ఆరోపణలు చేస్తున్నారు.

ప్రధాని అయ్యాక హైదరాబాద్ రాలేదని.. జమ్మూకాశ్శీర్.. బీహార్ రాష్ట్రాలకు ఇచ్చినట్లుగా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించటం లేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఓపక్క తండ్రేమో మోడీ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తుంటే.. మరోవైపు ఆయన కొడుకు.. కూతురు మాత్రం మోడీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ కు మోడీ అపాయింట్ మెంట్ లభిస్తుందా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ప్రధాని మోడీతో పాటు.. పలువురు కేంద్రమంత్రుల్ని కలిసి.. వార్షిక బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపుల విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరనున్నట్లు చెబుతున్నారు. కేంద్రమంత్రుల అపాయింట్ మెంట్ ఓకే? మరి.. మోడీ అపాయింట్ మెంట్ దొరుకుతుందా? అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News