ఢిల్లీకి వెళుతున్న ఇద్ద‌రు చంద్రుళ్లు

Update: 2017-06-21 06:52 GMT
ఒకే ప‌నికి రోజు తేడాతో దేశ రాజ‌ధాని ఢిల్లీకి వెళుతున్నారు ఇద్ద‌రు చంద్రుళ్లు. రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో త‌న స‌ల‌హాను ప్ర‌ధాని మోడీనే పాటించార‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పుకోవ‌టం తెలిసిందే. ఇక‌.. రాష్ట్రప‌తి ఎన్నిక‌కు అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు వీలుగా ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రితో మాట్లాడే బాధ్య‌త‌ను త‌న‌కు మోడీ అప్ప‌గించారంటూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెప్పుకుంటున్నారు. ఇలా.. తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు రాష్ట్రప‌తి ఎన్నిక విష‌యంలో వ‌చ్చే మైలేజీని సొంతం చేసుకోవ‌టానికి వీలుగా ఎవ‌రికి వారు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ నెల 23న రాష్ట్రప‌తి ఎన్నిక‌కు ఎన్డీయే అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగ‌నున్న రామ్ నాథ్ కోవింద్ నామినేష‌న్ దాఖ‌లు కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీతో ప్ర‌త్యేకంగా భేటీ కావ‌టంతో పాటు.. నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు కేసీఆర్ ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. ఎన్డీయేత‌ర పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్రప‌తి నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇదిలా ఉంటే.. ఎన్టీయే కూట‌మిలో మిత్ర‌ప‌క్షంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సైతం ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. రోజు తేడాతో ఇద్ద‌రు చంద్రుళ్లు ఢిల్లీ చేరుకోనున్నారు. త‌మ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో సీఎం కేసీఆర్ ప్ర‌ధాని మోడీతో పాటు ప‌లువురు కేంద్ర‌మంత్రుల్ని క‌ల‌వ‌నున్నారు. అదే స‌మ‌యంలో ఆయ‌న ఢిల్లీలోని ఆసుప‌త్రికి వెళ్ల‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ నెల 24న‌ కంటికి శ‌స్త్ర‌చికిత్స చేయించుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్న ప‌క్షంలో మ‌రో నాలుగు రోజులు ఢిల్లీలోనే ఉండి.. త‌ర్వాత హైద‌రాబాద్‌ కు వ‌స్తార‌ని చెబుతున్నారు.

ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు మాత్రం నామినేష‌న్ కార్య‌క్ర‌మం రోజు ఉద‌యం ఢిల్లీకి చేరుకొని.. నామినేష‌న్ కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత వెంట‌నే బ‌య‌లుదేర‌తార‌ని చెబుతున్నారు. మొత్తానికి రాష్ట్రప‌తి నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో ఇద్ద‌రు చంద్రుళ్లు పాల్గొన‌బోతున్నార‌న్న మాట‌. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News