అదే...బాబుకు, కేసీఆర్ కు ఉన్న తేడా...

Update: 2015-05-25 04:43 GMT
వారిద్దరు చెరో రాష్ర్టానికి సీఎంలు..ఇరువురు ప్రముఖ పార్టీల అధినేతలు. రాజకీయ చతురతలో ఒకరిని మించిన మరొకరు. ఇవి స్థూలంగా చెప్పాలంటే ఏపీ సీఎం, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు,  తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ దళపతి కే చంద్రశేఖర్ రావు సారుప్యతలు. అయితే ఇద్దరు తమదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నా కొన్నిసార్లు చంద్రబాబును మించిన పరిణితి కేసీఆర్ లో కనిపిస్తుంటుంది. తాజాగా జరిగిన ఓ పరిణామం ఇందుకు సాక్షంగా నిలిచింది.

కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా శిల్పా చక్రపాణిరెడ్డిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నియమించారు. దీనిపై ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మినీమహానాడు వేదికగా చంద్రబాబు తీరుపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడికి కర్నూలులో ఏ వీధి ఎక్కడుందో కూడా తెలియదని...ఆయన ఇవన్నీ నేర్చుకోవాలని నిండు సమావేశంలో అన్నారు. కేఈ అసహనం వెనక కారణాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 2014 ఎన్నికల ముందు వరకు శిల్పా చక్రపాణిరెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ లో ఆయన మంత్రి పదవులు అనుభవించారు. ఈ కాలంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అనేక ఇబ్బందుల పాలయ్యింది. చక్రపాణిరెడ్డి అక్రమాలను నిరసిస్తూ కర్నూలులో ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. హైదరాబాద్ లో ఉన్న శిల్పా మార్బుల్ కంపెనీ అక్రమంగా నడుస్తోందని టీడీపీ శ్రేణులు ఆ షాపు ఎదుట నిరసనలు కూడా చేపట్టారు. అలాంటి శిల్పా చక్రపాణిరెడ్డి తీసుకువచ్చి జిల్లా అధ్యక్షుడి హోదా కట్టబెట్టడం వల్ల పార్టీలో మొదటినుంచి ఉన్న కేఈ వంటివారికి మింగుడుపడకపోవడంలో వింతేముందని భావిస్తున్నారు. ఒకవేళ శిల్పాకు న్యాయం చేయాలనే భావిస్తే ఆయనకు ఎమ్మెల్సీ లేదా మరేదైనా నామినేటెడ్ పదవి ఇచ్చినా బావుండేదేమోనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలా చేస్తే ఆయన తమతో పాటు ఒకరిగా ఉండేవారని, జిల్లా అధ్యక్షుడి పగ్గాలు అప్పగించడం వల్ల... ఇన్నాళ్లు తామెవ్వరితో పోరాటం చేశామో... ఆయనవద్దకే వెళ్లాల్సి రావడంతో పాటు.... పార్టీ అధిష్టానం ఇచ్చే ఆదేశాలను శిల్పా ద్వారా విని పాటించాల్సిన పరిస్థితి వచ్చిందని కర్నూలు జిల్లా టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ శ్రేణులకు మార్గదర్శకం చేసిన కేఈ ఈ మేరకు వ్యాఖ్యానించారని నాయకులు భావిస్తున్నారు.

ఇదే రీతిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి పరిశీలిస్తే ఆయనకు ఇందుకు పూర్తి భిన్నం. 2014 ఎన్నికల వరకు మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న మైనంపల్లి హన్మంతరావు ఆ సమయంలో కాంగ్రెస్ లో చేరి అక్కడి నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చారు. తాజాగా పార్టీ పదవుల్లో మైనంపల్లిని గ్రేటర్ అధ్యక్షుడిని చేశారు కేసీఆర్. అంతే తప్ప సొంత జిల్లా మెదక్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమింపలేదు. కారణం..తనకు వ్యతిరేకంగా పనిచేశారనే స్పష్టమైన అవగాహన ఉండటంతో పాటు మైనంపల్లికి మెదక్ అద్యక్ష పదవి ఇస్తే పార్టీ పాత కేడర్ లో అసంతృప్తి వస్తుందనే స్పష్టతతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ పగ్గాలు మైనంపల్లికి ఇచ్చినా ఒక్కరు కూడా నిరసన తెలపకపోవడం ఇందుకు నిదర్శనంగా భావించవచ్చు.

ఈ లెక్కన తనకు అనుకూలురు ఎవరు.... సొంత ప్రయోజనాల కోసం పంచన చేరే వారు ఎవరు?అలాంటి వారిని ఏ విధంగా వాడుకోవాలో బాబు కంటే కేసీఆర్ మెరుగైన నాయకుడు అనిపించుకున్నాడని చెప్పడం అతిశయోక్తి కాదేమో.
Tags:    

Similar News